Telangana Rains: తెలంగాణకు అత్యంత భారీ వర్ష హెచ్చరిక.. ఈ జిల్లాల్లో 20 సెమీ పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం..!
ఈ ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Telangana Rains: ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా పడుతున్న వానలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇది చాలదన్నట్లు.. తాజాగా వాతావరణ కేంద్రం జారీ చేసిన హెచ్చరిక ప్రజల్లో మరింత ఆందోళన పెంచింది. తెలంగాణకు అత్యంత భారీ వర్ష హెచ్చరిక చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్ష హెచ్చరిక చేసింది.
ఈ జిల్లాల పరిధిలో 20 సెంటీమీటర్లకు పైబడి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది. ఈ ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు అలర్ట్ గా ఉండాలన్నారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలన్నారు. ఇక శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న వారు వెంటనే వాటిని ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. మరోవైపు ముంపు ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.