సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధం

రామగుండంలోని మూడు రీజియన్ల పరిధిలో 12 వేల 824 ఓటర్లుండగా... బెల్లంపల్లి రీజియన్‌ పరిధిలో 14 వేల 960 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు రీజియన్ల పరిధిలోనే 27 వేల 784 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధం

Singareni Union Elections

తెలంగాణలో సిరులు కురిపించే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 84 కేంద్రాల్లో సింగరేణి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. ఈసారి INTUC, AITUC మధ్యే ప్రధాన పోటీ ఉంది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగనున్నాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత కౌంటింగ్‌ మొదలవుతుంది. రాత్రి 7 గంటల తర్వాత ఫలితాలు వెల్లడికానున్నాయి. మొత్తం 39 వేల 748 మంది కార్మికులు సింగరేణి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 12 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 650 మంది ఉద్యోగులు పోలింగ్, కౌంటింగ్ విధులు నిర్వర్తించనున్నారు.

Also Read : ఎన్నికల వేళ వైసీపీకి టీడీపీ బిగ్ షాక్..! పీకేను దూరం చేసిన నారా లోకేశ్

పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద ఐదుగురు పోలీసుల చొప్పున కేటాయించారు. ఎన్నికలు పూర్తైన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంల్లో కౌంటింగ్ జరుగుతుంది. సింగరేణి ఎన్నికల్లో రామగుండం, బెల్లంపల్లి రీజియన్లు కీలకంగా మారాయి. ఈ రెండు రీజియన్లలో భారీగా ఓటర్లు ఉన్నారు. రామగుండంలోని మూడు రీజియన్ల పరిధిలో 12 వేల 824 ఓటర్లుండగా… బెల్లంపల్లి రీజియన్‌ పరిధిలో 14 వేల 960 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు రీజియన్ల పరిధిలోనే 27 వేల 784 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఇప్పటివరకు ఆరుసార్లు సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఏడోసారి ఎల్లుండి పోలింగ్ జరగబోతోంది. గత ఎన్నికల్లో 16 యూనియన్లు పోటీ చేయగా.. ఈసారి 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. గత రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌… సింగరేణిలో తమ అనుబంధ కార్మిక సంఘం.. TBGKS ను రెండుసార్లు గెలిపించుకుంది.

ఈ సారి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తమ అనుబంధ కార్మిక సంఘం అయిన INTUC గెలిపించుకోవాలని పావులు కదిపింది. 2003లో ఒక్కసారి మాత్రమే INTUC విజయం సాధించింది. మూడుస్లారు AITUC, రెండుసార్లు TBGKS గెలుపొందింది. 2019లోనే సింగరేణి యూనియన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంతో ఆ సమయంలో ఎన్నికలు ఆలస్యమైంది. సింగరేణి సంస్ధలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలను కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం పార్టీల అనుబంధ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల వేడి పెరిగింది.

Also Read : వైఎస్ షర్మిల టీడీపీకి దగ్గర అవుతున్నారా? జగన్ సోదరి వ్యూహం ఏంటి?

సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో INTUC గెలుపొందాలని అందుకు తీవ్రంగా కృషి చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి ఆదేశాలు అందటంతో రాష్ట్ర మంత్రులు, కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ప్రచారం చేశారు. సింగరేణి యూనియన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌… విజయం కోసం విస్తృత ప్రచారం చేసింది. మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బొగ్గుగనుల వద్ద ప్రచారం చేశారు. రెండు పర్యాయాలు గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్యం వహించిన TGBKS ఉనికి తాజా ఎన్నికల్లో ప్రశ్నార్ధకంగా మారింది. అగ్రనేతల రాజీనామాలతో అనూహ్యంగా బీఆర్ఎస్ అనుబంధ సంస్థ TBGKS… చతికిలపడింది.

దీంతో ప్రధానంగా AITUC, INTUC యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షంగా విజయం కోసం కృషి చేసిన సీపీఐ, కాంగ్రెస్‌… సింగరేణి ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారారు. దీంతో సింగరేణి గుర్తింపు పోరు ఆసక్తిగా మారింది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎన్నికలు కావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గుర్తింపు హోదా సాధించడం ప్రతిష్టాత్మకంగా మారింది. ఆసక్తికర పరిణామాల మధ్య జరుగుతున్న సింగరేణి ఎన్నికల్లో అంతిమ విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.