నా జీవితం తెరచిన పుస్తకం.. మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి

నా జీవితం తెరచిన పుస్తకం, మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

నా జీవితం తెరచిన పుస్తకం.. మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి

PM Modi

PM Modi Telangana Tour : నా ఇంటిని వదిలిపెట్టి.. ఓ లక్ష్యంతో వచ్చాను. నా జీవితం దేశం కోసం అంకితం.. మీ బిడ్డల కోసం నేను పరితపిస్తున్నాను.. నా జీవితం తెరచిన పుస్తకం, మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదిలాబాద్ జిల్లా లో జరిగిన బీజేపీ వికసిత్ భారత్-మోదీ గ్యారంటీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇది ఎన్నికల సభ కాదు.. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనే లేదు.. మీరందరూ వికసిత్ భారత్ కోసం ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని బీజేపీ కార్యకర్తలు, సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి మోదీ అన్నారు. దేశ అభివృద్ధి కోసం రూ. వేల కోట్ల పనులను చేపట్టామని, బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని మోదీ చెప్పారు. తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

Also Read : రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తాం : సీఎం రేవంత్ రెడ్డి

ఆదివాసీ సమాజం కోసం బీజేపీ కృషి చేస్తుందని, వారి గౌరవాన్ని పెంచేందుకు బీజేపీ పనిచేస్తుందని మోదీ అన్నారు. బీజేపీ రాకముందు ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా ఊహించారా? అని మోదీ ప్రశ్నించారు. మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా నెరవేరుతుంది.. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లకుపైగా లోక్ సభ స్థానాల్లో గెలుపే మా లక్ష్యం అని మోదీ అన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని మోదీ అన్నారు. రాంజీ గోండు పేరుతో హైదరాబాద్ లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఏడు టెక్స్ టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్శిటీ, రైతులకోసం పసుపు బోర్డును ఏర్పాటు చేశామని మోదీ గుర్తు చేశారు.

Also Read : ఎల్ఆర్ఎస్‌పై న్యాయ పోరాటం చేస్తాం.. 6న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు : కేటీఆర్

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగిందేమీ లేదు. బీఆర్ఎస్ మోసం, దోపిడీ పాలన పోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాళేశ్వరం కుంగింది. ఈ విషయంలో ఆ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కవుతోందని మోదీ విమర్శించారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నాయని మోదీ విమర్శించారు. కుటుంబ పార్టీలను నమ్మొద్దు, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. ఒకటి దోచుకోవడం, రెండో అబద్ధాలు చెప్పడం అంటూ మోదీ వ్యాఖ్యానించారు.

రామ మందిర నిర్మాణంలో తెలంగాణ పాత్ర ఉంది. రాంలల్లా ఆశీర్వాదం.. మొత్తం తెలంగాణ ప్రజలపై ఉంటుందని మోదీ అన్నారు. తెలంగాణ తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటుంది. రాబోయే తరాలకు కష్టాలు లేకుండా చేయాల్సిన బాధ్యత మనపై ఉందని మోదీ అన్నారు.