ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.

ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

Telangana Cabinet Meeting : హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయాలన్నారు. ఇక ఈ నెల 18న కేబినేట్ భేటీ నిర్వహించి రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు.

ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపైనా మంత్రివర్గ సమావేశంలో డిస్కస్ చేయనున్నారు. జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణ ఆధీనంలోకి తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో పాటు రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్.

షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. విద్యుత్తు సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు. పదేళ్లు పూర్తవనుండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ కే చెందుతుంది. పదేళ్లు పూర్తైనందున ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Also Read : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే స్థానాలు ఎన్ని? అవి ఏవి?