పరీక్షలు వాయిదా వేస్తే రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతుంది- మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు

రైతు కుటుంబం నుండి వచ్చిన రేవంత్.. సీఎం అయితే కేసీఆర్ ఓర్వడం లేదు. రేవంత్ పై అసూయతో కుట్ర చేస్తున్నారు.

పరీక్షలు వాయిదా వేస్తే రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతుంది- మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు

Madhu Yaskhi Goud (Photo Credit : Google)

Madhu Yaskhi : రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ లో చేరికలు, నిరుద్యోగుల ఆందోళనలు తదితర అంశాలపై చిట్ చాట్ లో కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ డైరెక్షన్ మేరకే చేరికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ గెలిచిన మూడు రోజులకే సర్కార్ కూలుతుందని ఇష్టానుసారం మాట్లాడారని మండిపడ్డారు. అహంకారంతోనే కేసీఆర్ ఓడిపోయారని చెప్పారు. అంబేద్కర్ పేరు మీదున్న ప్రాణహిత చేవెళ్లను కాదని కాళేశ్వరం కట్టారని ధ్వజమెత్తారు. దళిత నేత భట్టి సీఎల్పీగా ఉన్నప్పుడు ఆ హోదా పోయేలా చేశారని, దళిత వ్యతిరేకిగా ప్రధాని మోదీ, కేసీఆర్ పని చేశారని మధుయాష్కీ మండిపడ్డారు. ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు కూడా చేయొచ్చన్నారు. తామేమీ పైసలిచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కోవడం లేదని తేల్చి చెప్పారాయన.

కేసీఆర్‌తో ప్రజలు విసిగిపోయారు..
”కేసీఆర్ మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. హోంమంత్రి మహమూద్ అలీ ప్రగతిభవన్ కు వెళితే హోంగార్డుతో పంపించారు. గద్దర్, విమలక్కలకు కనీసం సమయం కూడా ఇవ్వలేదు. గద్దర్ ను గేటు దగ్గరే గంటల తరబడి నిలబెట్టారు. కేసీఆర్.. నియంత పాలన చేశారు. ప్రజా పాలనలో అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది. సీఎంను ఎవరైనా కలవొచ్చు. అందుకే ఎమ్మెల్యేలు వస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చొరబడి తానే ఉద్యమం చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. ప్రజలు విసిగి వేసారిపోయి కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు.

రేవంత్ సీఎం అయితే కేసీఆర్ ఓర్వలేకపోతున్నారు..
మేమేమీ ఇష్టంగా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం లేదు. పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ వ్యతిరేకమైనా.. తెలంగాణలో అనివార్యమైంది. కేంద్రంలో అధికారంలోకి వస్తాం అనుకున్నాం. అవినీతిపరంగా, అక్రమంగా ఎవరినీ చేర్చుకోవడం లేదు. మంత్రి పదవులు ఇస్తామని ఎవరికీ చెప్పడం లేదు. రైతు కుటుంబం నుండి వచ్చిన రేవంత్.. సీఎం అయితే కేసీఆర్ ఓర్వడం లేదు. రేవంత్ పై అసూయతో కుట్ర చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్, నేను చాలా కష్టపడ్డాం. నేను నేరుగా అమెరికా నుండి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయలేదు. విద్యార్ధి దశ నుండి రాజకీయాల్లో ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో 50 ఏళ్లకు పైగా వున్నా. నేను ఏ పార్టీ మారలేదు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే వున్నా.

కవిత విడుదల కోసం కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నాలు..
కవిత విడుదలపైనే బీఆర్ఎస్ ఫోకస్ అంతా. చెల్లి విడుదల కోసం బీజేపీలో బీఆర్ఎస్ మెర్జ్ చేయాలని కేసీఆర్, కేటీఆర్ చూస్తున్నారు. దానిపై ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారు. హరీశ్ రావుపై బండి సంజయ్ ప్రేమ ఒలకపోయాడానికి అదే కారణం. బీఆర్ఎస్ మెర్జ్ పై కేంద్ర బీజేపీ ఒకే చెబుతున్నా.. స్టేట్ బీజేపీ నేతలు వద్దంటున్నారు. అవసరమైతే కొందరు బీఆర్ఎస్ నేతలను చేర్చుకోండని అంటోంది.

కాంగ్రెస్ లో చేరికలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. మొన్నటివరకు వారిపైనే పోరాటం చేసి తిరిగి వారి వద్ద పని చేయడం కష్టమంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాస్త ఇబ్బంది తప్పదు.

పరీక్షలు వాయిదా వేస్తే 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది..
నిజంగా ఉద్యోగం కోసం పరీక్ష రాసే వారు ఎవరూ ఉద్యోగాలను వాయిదా వేయాలని అడగరు. పరీక్షలు (డీఎస్పీ, గ్రూప్-2) వాయిదా వేయడం వలన 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. శిక్షణ తరగతులు చెప్పే ఇన్ స్టిట్యూట్ లలో కెసీఆర్ కుటుంబానికి వాటాలున్నాయి. అందుకే పరీక్షలు వాయిదా వేయాలని అంటున్నారు. నారాయణ, చైతన్య కాలేజీలలో హరీశ్, కవితకు 15శాతం వాటాలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా దోపిడీ జరిగింది. అధికారులే.. కేసుల నుంచి బయటపడేస్తే.. వందల కోట్లు ఇస్తామంటున్నారు. నేతలు ఇంకెంత దోపిడీ చేశారో అర్థం చేసుకోవచ్చు” అని మధుయాష్కి అన్నారు.

Also Read : గుడ్‌న్యూస్.. పంటల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం