CM Revanth Reddy: బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఆగ్రహం

విచారణ కమిషన్ ముందు వాదన వినిపించకుండా కమిషన్ వద్దని కోర్టుకు వెళ్లారని తెలిపారు.

CM Revanth Reddy: బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఆగ్రహం

బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్, యాదాద్రి, భద్రాద్రి ఒప్పందాలపై విచారణ చేయాలని బీఆర్ఎస్ నేతలే అడిగారని, అందుకే విచారణ కమిషన్‌ను నియమించామని తెలిపారు. కమిషన్ దగ్గరకు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరితే కమిషన్ పైనే ఆరోపణలు చేశారని చెప్పారు.

విచారణ కమిషన్ ముందు వాదన వినిపించకుండా కమిషన్ వద్దని కోర్టుకు వెళ్లారని తెలిపారు. విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పిందని, కానీ కొత్త కమిషన్ చైర్మన్ ను నియమించాలని ఆదేశించిందని అన్నారు. కొత్త చైర్మన్ ను ఇవాళ సాయంత్రంలోగా నియమిస్తామని చెప్పారు.

తెలంగాణకు బీఆర్ఎస్ నేతలే ఏదో కొత్త వెలుగులు తెచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. వైఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్ దక్కిందని చెప్పారు. ఏ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ ఆస్తులు, సంబంధిత ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని చట్టం ఉందని తెలిపారు.

కానీ, ఉత్పత్తి ప్రాతిపదికన కాకుండా, వినియోగ ప్రాతిపదికన విభజన జరగాలని ఆనాడు జైపాల్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారని చెప్పారు. రాజ్యాంగంలో లేని ప్రత్యేక మినహాయింపు తెలంగాణకు ఇప్పించారని తెలిపారు. 53.46శాతం తెలంగాణకు, 46.54 శాతం ఏపీకి విద్యుత్ పంపిణీ చేసేలా జైపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని, తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లు కమ్మకుండా చేశారని అన్నారు. సత్యహరిశ్చంద్రుడి తరువాత కేసీఆరే అన్నట్లు విద్యుత్ ఒప్పందాల విషయంలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, ఇంకెన్నాళ్లు ఈ ఊదరగొట్టుడని నిలదీశారు.

Also Read: ఢిల్లీ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థుల మృతి.. తెలంగాణలోనూ అలాంటి కోచింగ్ సెంటర్లను చూపిస్తా: రాజాసింగ్