Trump vs Harris debate : వాడీవేడిగా ట్రంప్ – హారిస్ తొలి డిబేట్.. తొలుత షేక్‌హ్యాండ్‌.. ఆ తరువాత మాటల యుద్ధం

ట్రంప్ మాట్లాడుతూ.. నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు అమెరికాను చూసి భయపడేవి. కానీ, ఇప్పుడు అమెరికాను శాసించే స్థాయికి ..

Trump vs Harris debate : వాడీవేడిగా ట్రంప్ – హారిస్ తొలి డిబేట్.. తొలుత షేక్‌హ్యాండ్‌.. ఆ తరువాత మాటల యుద్ధం

Harris vs Trump

Harris vs Trump 2024 Polls : ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష అభ్యర్థుల డిబేట్ వాడీవేడిగా జరిగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్ స్టిట్యూషన్ సెంటర్ వేదికగా రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ సుమారు 90 నిమిషాల పాటు జరిగింది. ఇరువురి మధ్య పలు అంశాలపై మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో సాగింది. డిబేట్ ప్రారంభంకు ముందు ట్రంప్, హారిస్ లు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. గత కొన్నేళ్లలో జరిగిన డిబేట్ లలో ప్రారంభంకు ముందు ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న సందర్భాలు లేవు. అయితే, ట్రంప్, హారిస్ ఇద్దరూ డిబేట్ ప్రారంభంకు ముందు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ఆ తరువాత జరిగిన డిబేట్ లో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగింది.

Also Read : Rahul Gandhi : రిజర్వేషన్ల రద్దు అంశం.. ఎన్నికల సంఘంపై కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ

మహిళల అభివృద్ధి ట్రంప్ కు నచ్చదంటూ హారిస్ విమర్శించారు. అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారు. అత్యాచారాల వంటి కేసుల్లోనూ మహిళలకు ఎలాంటి మద్దతు ఇవ్వాలనుకోవడం లేదు. ఇది మహిళలను అవమానించడమే. అమెరికా ప్రజలు స్వేచ్ఛాప్రియులు అని హారిస్ అన్నారు. ట్రంప్ ఘాటుగా బదులిచ్చారు. అబార్షన్లపై నిషేధానికి నేను అనుకూలం కాదు. ఆ బిల్లుపై సంతకం చేయబోనని ట్రంప్ అన్నాడు. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంపైనా వీరిమధ్య వాదోపవాదనలు జరిగాయి. ట్రంప్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి కమలా హారిస్ ఇజ్రాయెల్, నెతన్యాహులను ద్వేషిస్తున్నారు. నెతన్యాహు అమెరికా పార్లమెంట్ కు చేరుకున్నప్పుడు హారిస్ అతన్ని కలవలేదు. ఆమె అరబ్ ప్రజలను ద్వేషిస్తుంది. ఆమె అమెరికా అధ్యక్షురాలు అయితే ఇజ్రాయెల్ రెండేళ్లలో తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. హారిస్ స్పందిస్తూ.. ఇజ్రాయెల్ కు తమను తాము రక్షించుకునే హక్కు ఉంది. కానీ, ఈ యుద్ధం ముగియాలని మేం కోరుకుంటున్నామని చెప్పారు.

Harris vs Trump

ట్రంప్ మాట్లాడుతూ.. నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు అమెరికాను చూసి భయపడేవి. కానీ, ఇప్పుడు అమెరికాను శాసించే స్థాయికి అవి చేరుతున్నాయని అన్నారు. కమలా హరిస్ కల్పించుకొని.. ట్రంప్, కిమ్ జోంగ్ మధ్య ప్రేమ లేఖ గురించి చర్చలు జరుగుతున్నాయని కౌంటర్ ఇచ్చారు. వైట్ హౌస్ లోని పాత రికార్డులను తొలగించే సమయంలో కొన్ని ప్రేమ లేఖలు కనుగొనబడ్డాయి. వీటిని ఉత్తర కొరియా నాయకుడు కిమ్ ట్రంప్ కు, ట్రంప్ కిమ్ కు పంపారంటూ హరిస్ సెటైర్లు వేశారు.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై కమలా హరిస్ మాట్లాడుతూ.. ట్రంప్ అధ్యక్షుడిగా ఉండిఉంటే.. పుతిన్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో కూర్చుని ఉండేవారని అన్నారు. అమెరికా సహకారం, వైమానిక రక్షణ సహాయం, ఆయుధాల కారణంగా నేడు ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా నిలుస్తోందని చెప్పారు. ట్రంప్ మాట్లాడుతూ.. నేను ఈ యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాను. నేను ప్రెసిడెంట్ కాకముందే దీనిని ఆపాలనుకుంటున్నాను. నేను జెలెన్స్కీ, పుతిన్ లను ప్రధాన చర్చలకు తీసుకువస్తాను. ఈ యుద్ధం జరగకూడదని అన్నారు.

నేను అమెరికా అధ్యక్షుడిని అయితే ఒబామాకేర్ ను మారుస్తానని ట్రంప్ అన్నారు. అది అంత మెరుగ్గా లేదు. మేము దాని స్థానంలో వేరొకదానితో ముందుకు వస్తాం. ఒబామాకేర్ ను రద్దు చేయడంలో డమొక్రాట్ పార్టీ విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. ఒబామాకేర్ అనేది అమెరికాలో తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య బీమా చట్టం. అంటే స్థోమత రక్షణ చట్టం, దీనిని ఒబామాకేర్ అని కూడా పిలుస్తారు.

గతంలో అమెరికాను ట్రంప్ నిరుద్యోగంలో వదిలేశారు.. అగ్రరాజ్యాన్ని సమస్యల్లో వదిలేశారు. ట్రంప్ మళ్లీ ఎన్నికైతే అమెరికాకు చిక్కులేనని హారిస్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాబిన్నం చేశారు. ట్రంప్ హయాంలో అమెరికా ద్రవ్య లోటు ఎదుర్కొందని పేర్కొన్నారు. ట్రంప్ స్పందిస్తూ.. కరోనా సమయంలో సమర్ధవంతంగా పనిచేశా. అమెరికా కోసం హారిస్ వద్ద ఎలాంటి పథకాలు లేవు. కరోనా కాలంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టానని అన్నారు. అమెరికాను నవంబర్ వన్ గా నిలపడమే నా లక్ష్యం అని ట్రంప్ స్పష్టం చేశారు.