జగన్ కీలక నిర్ణయంతో ఊపిరిపీల్చుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్

  • Published By: naveen ,Published On : October 16, 2020 / 03:19 PM IST
జగన్ కీలక నిర్ణయంతో ఊపిరిపీల్చుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్

pawan kalyan: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీతో దాదాపు 40 నిమిషాలకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. జగన్‌ ఢిల్లీ పర్యటన అనగానే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రెండు వారాల వ్యవధిలోనే జగన్‌ రెండోసారి ఢిల్లీ వెళ్లడంతో వివిధ రకాల ఊహాగానాలు వినిపించాయి. దీంతో ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కొంత ఆందోళన చెందారనే టాక్‌ వినిపించింది. కాకపోతే ప్రస్తుతానికి ఎలాంటి రాజకీయ నిర్ణయం ఢిల్లీలో జరగకపోవడంతో పవన్‌కు కొంత ఉపశమనం కలిగించినట్టయ్యిందని అంటున్నారు.

జగన్ తీసుకున్న నిర్ణయంతో పవన్ కు ఉపశమనం:
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, ఇతరత్రా అంశాల గురించి చర్చించేందుకే జగన్‌ ఢిల్లీ వెళ్లారని వైసీపీ చెబుతున్నా.. రాజకీయ వర్గాల ఆలోచనలు మాత్రం భిన్నంగా సాగాయి. ఎన్డీయేలో వైసీపీ చేరుతుందనే ప్రచారం జరిగింది. ప్రధాని మోదీని కలిసిన తర్వాత వచ్చిన వార్తల ప్రకారం ఎన్డీఏలో చేరడానికి జగన్ ఇప్పుడిప్పుడే సిద్ధంగా లేరంటున్నారు. అంతగా అవసరమైతే అప్పుడు మద్దతు ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కల్యాన్‌ కాస్త ఊపిరి పీల్చుకున్నారని భావిస్తున్నారు.

జనసేన పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోయేది:
ఏపీలో బీజేపీతో కలసి సాగుతున్న పవన్‌కల్యాణ్‌కు వైసీపీ ఒకవేళ ఎన్డీయేలో చేరితే ఇబ్బందిగా ఉండేది. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మీద బీజేపీ, జనసేన విమర్శల దాడి చేస్తున్నాయి. వివాదాస్పద అంశాల విషయంలో ఆ పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ సారథ్యంలోని వైసీపీ కేంద్రంలోని ఎన్డీఏలో చేరితే జనసేన పార్టీ ఇరుకున పడేదని అంటున్నారు. ఎందుకంటే, కేంద్రంలో వైసీపీ చేరితో రాష్ట్రంలో బీజేపీ… జగన్ మీద విమర్శలు చేయడానికి సాహసించదు. దీంతో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన పరిస్థితి అటూ ఇటూ కాని విధంగా తయారవుతుంది.

అమరావతి కోసమే బీజేపీతో పొత్తు:
మరోపక్క, ఇప్పుడిప్పుడే ఎన్డీయేలో వైసీపీ చేరకపోవచ్చని, బయట నుంచి మాత్రమే మద్దతిస్తుందనే వార్తల నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు కొంత ఊరట లభించినట్టే అంటున్నారు. గతంలో కూడా జగన్ ఎన్డీయే గూటికి చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. అప్పట్లో దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. బీజేపీతో వైసీపీ కలిస్తే తప్పు లేదని, ఒకవేళ పొత్తు పెట్టుకుంటే అందులో జనసేన ఉండబోదని పవన్ కుండబద్దలు కొట్టారు. అమరావతి కోసం ఎలాంటి షరతులు లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని కూడా చెప్పారు. ఎన్డీయేలో వైసీపీ చేరకపోతే జనసేన, బీజేపీ పొత్తుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

కొత్త మిత్రుల కోసం బీజేపీ తహతహ:
కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం వైసీపీపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఎన్డీయే నుంచి రెండు పార్టీలు బయటకు వెళ్లిపోయాయి. శివసేన, శిరోమణి అకాలీదళ్‌ పార్టీలు వివిధ కారణాలతో ఎన్డీయేకు దూరమయ్యాయి. దీంతో కొత్త మిత్రులను దగ్గర తీసుకునేందుకు బీజేపీ నిర్ణయించుకుందని అంటున్నారు. అందులో భాగంగానే వైసీపీని ఎన్డీఏలో చేరాలని కోరుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఎన్డీయేలో వైసీపీ చేరితే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై కూడా జనసేన ముఖ్య నాయకులు ఆలోచిస్తున్నారట. అందుకు అనుగుణంగా సరైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటోందని టాక్‌.

చంద్రబాబు, లోకేష్ పై సీబీఐ విచారణ:
రాష్ట్రంలోని తమ ప్రత్యర్థి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ బహిరంగంగానే కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలయ్యేలా కేంద్ర స్థాయిలో సహకారం అందించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఈ క్రమంలోనే ఎన్డీయేలో చేరితే వైసీపీ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందిస్తామని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

కేంద్రానికి మద్దతిచ్చేందుకు వైసీపీ సిద్ధం:
ఎన్డీఏలో చేరడం మినహా అన్ని అంశాల్లో కేంద్రానికి మద్దతిచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉందంటున్నారు. రాష్ట్రంలోని తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో పాటు ప్రత్యేక హోదా సహా వివిధ అంశాలపై కేంద్రం క్లారిటీ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వంలో చేరితే విపక్షాలకు టార్గెట్ అవుతామనే భావనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద జగన్‌ ఈ విషయాన్ని పెండింగ్‌లో పెట్టేయడంతో పవన్‌ కల్యాణ్‌కు ఉపశమనం లభించినట్టయ్యిందని అంటున్నారు.