Tirumala : తిరుమలకు రావొద్దు.. కరోనా కారణంగా కొండపై కొత్త ఆంక్షలు

తిరుమల శ్రీవారి భక్తులపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. కొండపై మళ్లీ రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టీటీడీ అలర్ట్ అయ్యింది. మరోసారి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అంతేకాదు శ్రీవారి దర్శనాల విషయంలోనూ కండీషన్ పెట్టింది.

Tirumala : తిరుమలకు రావొద్దు.. కరోనా కారణంగా కొండపై కొత్త ఆంక్షలు

New Corona Rules In Tirumala

New Corona Rules In Tirumala : తిరుమల శ్రీవారి భక్తులపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. కొండపై మళ్లీ రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టీటీడీ అలర్ట్ అయ్యింది. మరోసారి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అంతేకాదు శ్రీవారి దర్శనాల విషయంలోనూ కండీషన్ పెట్టింది.

ఈ లక్షణాలు ఉంటే రావొద్దు:
జ్వరం, దగ్గు, జలుబు లాంటి కరోనా లక్షణాలు ఉంటే తిరుమలకు రావొద్దని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి భక్తులను కోరారు. తిరుమలకు వచ్చే భక్తులు టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొండపై కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపడతామని చెప్పారు. కేసులు తీవ్రమైతే శీఘ్ర దర్శనం టికెట్లు రద్దు చేసి వాటిని మే, జూన్‌కు రీషెడ్యూల్‌ చేస్తామన్నారు.

భక్తుల సంఖ్య భారీగా కుదింపు:
కేసులు పెరుగుతుండటంతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది టీటీడీ. ఇక నుంచి రోజువారీగా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను 45వేలకు(అన్ని రకాల దర్శనాలు) పరిమితం చేసింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసంలలో ఇస్తున్న సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను ఇక నుంచి 15వేలకు పరిమితం చేయాలని నిర్ణయం తీసుకుంది. మే, జూన్‌కు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో కూడా ఉంది టీటీడీ.

భక్తుల సంఖ్య 15వేలకు పరిమితం:
ఇప్పటివరకు ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టోకెన్లు 22 వేల వరకు ఇస్తున్నారు. వీకెండ్స్‌లో అయితే 25 వేల వరకు ఇస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పుడా సంఖ్యను 15 వేలకు పరిమితం చేశారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో విక్రయించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను.. 25వేల మంది భక్తులను యథావిధిగా అనుమతిస్తామంది టీటీడీ.

మాస్కు, భౌతిక దూరం, శానిటైజర్ మస్ట్:
శ్రీవారిని దర్శించుకునే భక్తులు.. కోవిడ్ నిబంధనలు ఖచ్చింగా పాటించాలని టీటీడీ కోరింది. భక్తులందరూ మాస్కులు ధరించడంతో పాటు.. శానిటైజర్‌లు వాడాలని సూచించింది. అంతేకాకుండా తిరుమలలోని వసతి గదుల్లో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామంది. భక్తుల ఆర్జిత సేవల అనుమతిపై కూడా టీటీడీ పునరాలోచనలో పడింది. ఉగాది నుంచి భక్తులను అనుమతించాలని గతంలో నిర్ణయం తీసుకున్న టీటీడీ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏప్రిల్ 14 తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.

కొండపై కరోనా కలకలం:
కరోనా కేసులు పెరుగుతున్నాయని.. అందుకే తిరుపతిలో ఇస్తున్న సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టికెట్ల కోటాను తగ్గిస్తున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలో కొవిడ్‌ కేసులు 79కి చేరాయని.. వీరిలో 10 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారని ఆయన చెప్పారు. ముందు జాగ్రత్తగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, గదుల కేటాయింపు దగ్గర థర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు.

టికెట్ ఉంటేనే కొండపైకి:
శ్రీవారి దర్శనం టికెట్లు ఉన్నవారిని మాత్రమే కొండపైకి అనుమతిస్తామని అధికారులు స్పష్టంచేశారు. నడకదారి భక్తులకు ముందురోజు ఉదయం 9గంటల నుంచి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే, వాహనాల్లో వచ్చేవారికి ముందురోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అనుమతిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాజా కరోనా కేసుల్లో అత్యధికంగా 181 కొత్త కేసులు చిత్తూరు జిల్లాలోనే నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.