Andhra Pradesh : ఏపీలో మాయమవుతోన్న సముద్ర తీర గ్రామాలు..విశాఖలో 30 ఏళ్లల్లో..మూడున్నర కిలోమీటర్లు అదృశ్యం..

Andhra Pradesh : ఏపీలో మాయమవుతోన్న సముద్ర తీర గ్రామాలు..విశాఖలో 30 ఏళ్లల్లో..మూడున్నర కిలోమీటర్లు అదృశ్యం..

Sea Level Change In Andhra Pradesh

Sea Level Change In Andhra Pradesh : ఏపీలోని సముద్ర తీర ప్రాంతాలు మాయం అయిపోతున్నాయి. రోజురోజుకు సముద్ర తీరం వెంట ఉన్న గ్రామాలు కనుమరుగవుతున్నాయి. ఇళ్లకు ఇళ్లు మాయమవుతున్నాయి. సముద్రుడు మొత్తం కోస్టల్ ఏరియా రూపురేఖలను మార్చేస్తున్నాడు. గ్లోబల్ వార్మింగ్, తుఫాన్లతో పాటు నిర్మాణాలు ఏపీలోని సముద్ర తీర ప్రాంతంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఊళ్లకు ఊళ్లు సముద్ర గర్భంలో కలిసిపోతాయని అంచనా వేస్తున్నారు. ఒక్క ఏపీనే కాదు.. అటు ఒడిశా, ఇటు తమిళనాడులో సైతం ఇదే పరిస్థితి. అంతకంతకు సముద్రం ముందుకు రావడంతో భూభాగం తరిగిపోతోంది. ముఖ్యంగా విశాఖలో 30 ఏళ్లల్లో మూడున్నర కిలోమీటర్లు తీరం కోతకు గురైందని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఇలానే ఉంది.

ఏపీలో సుమారు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అందులో 294.89 కి.మీ. అంటే దాదాపు 28 శాతం తీరం గత ముప్పై ఏళ్లలో కోతకు గురైంది. 509.33 కి.మీ. అంటే 49.6 శాతం మేర ఇసుక మేట వేసింది. 223.36 కి.మీ. అంటే 21.7 శాతం స్థిరంగా ఉంది. ముఖ్యంగా విశాఖ తీరం మూడు దశాబ్దాలుగా కోతకు గురవుతోంది. విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న 32 కిలోమీటర్ల పొడవైనా తీరం స్వరూపం రోజురోజుకు మారిపోతోంది. ఆ మార్పుల కారణంగానే ఒక్కోసారి ఒక్కోచోట తీరం కోతకు గురవుతోంది. కొద్దిరోజుల కిందట విశాఖ ఆర్కే బీచ్ సమీపంలోని చిల్డ్రన్ పార్కు దగ్గర బీచ్ కోతకు గురై, పార్కు అంతా బీటలువారి… సముద్రం వైపు ఒరిగింది. ఆర్కే బీచ్‌లో నాలుగేళ్ల క్రితం కొబ్బరి చెట్లకు దూరంగా సముద్రం ఉండేది.. ఇప్పుడు ఆ చెట్లు సైతం సముద్రంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది.

రెండేళ్ళ క్రితం వరుణ్ చిల్డ్రన్ పార్కు వద్ద బీచ్ భారీగా కొతకు గురై పార్కు మెుత్తం కుంగిపోయింది. 2015లో అలల ఉద్ధృతికి బీచ్ రోడ్డులోని రక్షణ గోడ ఏకంగా 18 మీటర్ల పొడవున కూలిపోయింది. హార్బరు నుంచి మొదలు పెడితే ఆర్కే బీచ్, సబ్ మెరైన్, లైట్ హౌస్, వుడా పార్క్, కైలాసగిరి, తెన్నేటి పార్కు, సాగర్ నగర్, రుషికొండ, తొట్లకొండ, భీమిలి… ఇలా విశాఖలో అడుగడుగునా ఓ టూరిస్టు ప్లేస్ ఉంటుంది. ఈ ప్రాంతాలన్నిటిలోనూ తీరం కోతకు గురవుతూనే ఉంది. అయినా ఇక్కడ మళ్లీ మళ్లీ నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు. విశాఖ తీరానికి రక్షణ కవచాల్లాంటి ఎత్తయిన ఇసుక దిబ్బలు, మడ అడవులకు తుపాన్లతో పాటు నగరీకరణ, పర్యటకాభివృద్ధి, పరిశ్రమల పేరుతో ముప్పు ఏర్పడుతోందంటున్నారు నిపుణులు. తీరం వెంబడి భారీ కట్టడాల వల్ల సముద్రం నుంచి తీరానికి వచ్చే బలమైన అలల దిశ మారిపోతుంది అంటున్నారు పరిశోధకులు. దిశ మారిన అలలు ఒక్కోసారి ఒక్కోచోట తీరాన్ని బలంగా తాకుతాయి. దీనివల్ల అప్పటికే బలహీనంగా ఉన్న తీర ప్రాంతంలోని మట్టి, ఇసుక జారిపోయి తీరం ఎక్కువగా కోతకు గురవుతోంది. ఆ ప్రదేశాల్లో ఏవైనా నిర్మాణాలుంటే అవి కూలిపోతున్నాయి.

విశాఖ మాత్రమే కాదు తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ.. శ్రీకాకుళం, విజయనగరంతో పాటు దక్షిణ కోస్తా ప్రాంతంలో తీర ప్రాంతం అంతకంతకు కోతకు గురవుతోంది. గత 30 ఏళ్లలో నెల్లూరు జిల్లాలో 53.32 కి.మీ., ప్రకాశం జిల్లాలో 13.72 కి.మీ., గుంటూరు జిల్లాలో 7.53 కి.మీ. కృష్ణా జిల్లాలో 57.55 కి.మీ. కోతకు గురైంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో7.73 కి.మీ., తూర్పుగోదావరి జిల్లాలో 89.25 కి.మీ., విశాఖపట్నం జిల్లాలో 25.81 కి.మీ., విజయనగరంలో 14.86 కి.మీ., శ్రీకాకుళం జిల్లాలో 25.12 కి.మీ. కోతకు గురైనట్టు లెక్కలు చెబుతున్నాయి.

ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో సముద్ర కోత ఎక్కువగా ఉంది. కాకినాడ సమీపంలోని ఉప్పాడ గ్రామం నిత్యం సముద్రపు కోతకు గురవుతూనే ఉంది. ఇక్కడ జీవిస్తున్న మత్స్యకార కుటుంబాల ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. ఉప్పెన సినిమాలో చూపించే ఒక గుడి.. హీరో ఇళ్లు సైతం ఇప్పుడు సముద్రంలో కలిసిపోయాయి. 2011 రెవెన్యూ రికార్డుల ప్రకారం 137 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన ఉప్పాడలో ఇప్పటికే 40 హెక్టార్లకు పైగా భూమి మాయమైపోయింది. నిత్యం తీరంలో నివసించే వారికి సముద్రపు అలల తీవ్రత పెద్ద సమస్యగా మారుతోంది. రానురాను సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుండటంతో ఇప్పటికే వందల ఇళ్లు కూలిపోయాయి. ఆ ఊళ్లో ఇప్పటి వరకు నాలుగు ఆలయాలు, మూడు పాఠశాలలు, రెండు ట్రావెలర్స్ బంగ్లాలు సముద్రంలో కలిసి పోయాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు తమిళనాడులోని చెన్నై వరకు సముద్రం తీరం పరిస్థితి ఏడాదికేడాదికి మారిపోతోంది. తీరం వెంబడి ఇళ్లు, నిర్మాణాలు కనుమరుగయిపోతున్నాయి.