చిత్తూరు జిల్లాలో డాక్టర్‌ నిర్వాకం : అబార్షన్ వికటించి గర్భసంచి, చిన్నప్రేగుకు రంధ్రం

చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్.. మహిళకు లింగ నిర్ధారణ చేయడమే కాకుండా.. ఆబార్షన్ కూడా చేశాడు. అది వికటించడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.

  • Published By: veegamteam ,Published On : February 5, 2020 / 01:49 PM IST
చిత్తూరు జిల్లాలో డాక్టర్‌ నిర్వాకం : అబార్షన్ వికటించి గర్భసంచి, చిన్నప్రేగుకు రంధ్రం

చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్.. మహిళకు లింగ నిర్ధారణ చేయడమే కాకుండా.. ఆబార్షన్ కూడా చేశాడు. అది వికటించడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.

పుట్టబోయే బిడ్డ.. ఆడా.. మగా.. ముందే తేల్చేస్తున్నారు కొంతమంది డాక్టర్లు. ఆడపిల్ల అని తెలిస్తే వెంటనే అబార్షన్‌లు కూడా చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పీలేరులో ఓ డాక్టర్‌ ఇలాంటి నిర్వాకాలే చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. నోబుల్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ భాష.. కవిత అనే మహిళకు లింగ నిర్ధారణ చేయడమే కాకుండా.. ఆబార్షన్ కూడా చేశాడు. అది వికటించడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. కుటుంబసభ్యులు మరో హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేయడంతో బాధితురాలు ఊపిరి పీల్చుకుంది. 

పీలేరుకు చెందిన కవిత.. మగబిడ్డ కావాలనే ఆలోచనతో నోబుల్ హస్పిటల్‌కి వెళ్లింది. స్కానింగ్ చేసిన డాక్టర్ భాష… పుట్టబోయేది ఆడబిడ్డని తేల్చేశాడు. దీంతో డీలా పడ్డ కవిత దంపతులు అబార్షన్‌ చేయాలని కోరారు. ఏమాత్రం ఆలోచించకుండా కవితకు అబార్షన్‌ చేశాడు భాష. ఆపరేషన్‌ వికటించి కవిత తీవ్ర అనారోగ్యానికి గురయింది. ఆమె పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిలో చేర్పించారు. 

కవితను పరీక్షించిన వైద్యులు అవాక్కయ్యారు. గర్భసంచితో పాటు చిన్న ప్రేగుకు సైతం రంద్రం పడినట్టు గుర్తించారు. అబార్షన్ సక్రమంగా చేయని కారణంగా అలా జరిగిందన్నారు. తప్పనిసరి పరిస్థితిలో కవితకు గర్భసంచిని తొలగించారు. అలాగే రుయా ఆస్పత్రి డాక్టర్లు చిన్న పేగుకి సంబంధిత ఆపరేషన్‌ చేశారు. ప్రస్తుతం కవిత కోలుకుంటోంది.

ఇంటికి దగ్గరగా ఉన్నాడనే కారణంతో డాక్టర్‌ భాషను సంప్రదించామని బాధితురాలు కవిత చెబుతోంది. ఆపరేషన్‌ సరిగా చేయని కారణంగానే ప్రాణాపాయ స్థితి చేరుకున్నానని అంటున్నారు. కలెక్టర్ ఆదేశాలతో పీలేరులోని నోబుల్ ఆస్పత్రికి వెళ్లామని.. అప్పటికే డాక్టర్ భాష ఓ గర్భిణికి స్కానింగ్‌ చేస్తూ దొరికిపోయాడని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రమాదేవి అన్నారు. కవిత అనారోగ్యానికి భాషనే కారణమని అన్నారు. 

కవితకు సకాలంలో ఆపరేషన్‌ చేయడంతో ముప్పు తప్పిందని రుయా ఆస్పత్రి వైద్యులు అన్నారు. మరో రెండు నెలల పాటు బాధితురాలికి ఇబ్బంది తప్పదని డాక్టర్‌ రమణయ్య తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నోబుల్‌ ఆస్పత్రిని సీజ్ చేశారు.