క్రికెట్‌లో బెట్టింగ్‌తో ఈజీగా డబ్బు సంపాదించాలని కలలు కంటున్నారా? బీకేర్ ఫుల్, మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయం

  • Published By: naveen ,Published On : October 7, 2020 / 11:44 AM IST
క్రికెట్‌లో బెట్టింగ్‌తో ఈజీగా డబ్బు సంపాదించాలని కలలు కంటున్నారా? బీకేర్ ఫుల్, మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయం

cricket betting: మీరు క్రికెట్‌ అభిమానులా..? ఐపీఎల్‌లో ఏ టీమ్‌ గెలుస్తుందో ముందే ఊహించేస్తున్నారా..? బెట్టింగ్‌ కాసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే కాస్త ఆగండి. మీకు డబ్బు ఆశ చూపి నిండా ముంచేసుందుకు కొందరు కాచుకు కూర్చుకున్నారు. మీకు క్రికెట్‌ గురించి ఎంత తెలిసినా..మీ డబ్బు మాయమవ్వడం మాత్రం ఖాయం. దుబాయ్‌లో ఐపీఎల్‌.. హైదరాబాద్‌లో చీటింగ్‌.. యువతే టార్గెట్‌గా భారీగా మోసాలు‌‌.. వాట్సాప్ చాటింగ్స్‌తో బాల్ టు బాల్ బెట్టింగ్.. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మనీ ట్రాన్‌జక్షన్‌..

7 ముఠాలు..,30 మంది నిందితులు.. రూ.40 లక్షలకు పైగా నగదు స్వాధీనం:
ఐపీఎల్‌ వేళ క్రికెట్ బెట్టింగ్‌ దందా జోరందుకుంది. దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్‌ క్రికెట్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఆడుతున్న సందర్భంలో ప్రతి బంతికీ బెట్టింగ్‌ కాస్తున్నారు. కొంతమంది బుకీలు ఏకంగా దుబాయ్‌లో ఉన్న ముఠాలతో సంబంధాలు పెట్టుకొని దందా నిర్వహిస్తున్నారు.

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఆదేశాలతో ఇలాంటి ముఠాలపై నిఘా ఉంచిన సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు….ఇప్పటికే 7 ముఠాలను, 30 మంది నిందితులను కటకటాల్లోకి నెట్టారు. వారి నుంచి 40 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా బాలానగర్‌ ఎస్‌వోటీ పోలీసులు..పేట్‌బషీరాబాద్‌ పరిధిలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు.

క్రికెట్‌ బెట్టింగ్‌కి అడ్డాగా మారిన సుచిత్రా ఎక్స్ రోడ్డులోని ఆప్టికల్స్ షాప్‌:
కొంపల్లి ఓక్‌ ట్రీ ఎంక్లేవ్‌కు చెందిన చందూర్‌ శశాంక్‌…సుచిత్రా ఎక్స్‌రోడ్డు సమీపంలో ఓంకార్‌ ఆప్టికల్స్‌ బిజినెస్‌ చేస్తున్నాడు. అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ఆ షాప్‌నే క్రికెట్‌ బెట్టింగ్‌కి అడ్డాగా మార్చేశాడు. గోవాకు చెందిన ప్రధాన బుకీలు బర్కత్, సాహిల్‌తో సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌లో తనకున్న పరిచయాలు ఉపయోగించుకొని వారందరిని క్రికెట్‌ బుకింగ్‌ వైపు మళ్లించాడు.

ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు డిపాజిట్‌:
వాట్సాప్‌ కాల్‌ చేసి డబ్బులను గూగుల్‌ పే, ఫోన్‌పేలకు పంపమనేవాడు. బెట్టింగ్‌ కాసేవాళ్లు ఒక్కొక్కరు 50 వేలు డిపాజిట్‌ చేయమని సూచించేవాడు. ఆ తర్వాత క్రికెట్‌ లైన్, క్రికెట్‌ ఎక్స్‌ఛేంజ్‌ మొబైల్‌ యాప్‌లను ఆధారంగా చేసుకొని గోవాకు చెందిన సాహిల్‌ రేటింగ్‌ ఇచ్చేవాడు. బలమైన టీమ్‌లకు 10 వేలకు 7 వేలు, బలహీన టీమ్‌లకు 10 వేలకు 9 వేలు అంటూ బెట్టింగ్‌ వేసేవారు. అయితే చాలా మంది పంటర్లు ఎక్కువ డబ్బులు రావాలనే ఆశతో 10 వేలకు 9 వేల రేటింగ్‌ ఇచ్చిన వాటికే మొగ్గు చూపారు.

అలాగే ప్రతి బంతికి కూడా ఆయా బ్యాట్స్‌మెన్‌ చేసే పరుగులకు కూడా రేటింగ్‌ ఇస్తూ పంటర్ల నుంచి బెట్టింగ్‌ ఉండేలా చూసుకునేవారు. ఇందులో వచ్చిన డబ్బులను గోవాలో ఉండే ప్రధాన బుకీ బర్కత్‌కు శశాంక్‌ పంపేవాడు.

ఆప్టికల్స్ షాప్ ఓనర్ శశాంక్ సహా ఏడుగురు పంటర్లు అరెస్ట్‌:
అయితే ఐపీఎల్‌ టోర్నీ ప్రారంభం కావడంతో సైబరాబాద్‌ పోలీసులు క్రికెట్‌ బెట్టింగ్‌లపై ప్రధానంగా నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే బాలానగర్‌ స్పెషల్‌ అపరేషన్‌ టీమ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.రమణారెడ్డి నేతృత్వంలోని బృందం…పేట్‌బషీరాబాద్‌ పోలీసుల సహకారంతో సుచిత్రా ఎక్స్‌ రోడ్డులోని అప్టికల్స్‌లో శశాంక్, ఏడుగురు పంటర్లను పట్టుకున్నారు. 22 లక్షల 89 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన బుకీలు బర్కత్, సాహిల్‌తో పాటు మరో ఏడుగురు పంటర్ల కోసం గాలిస్తున్నారు.

డబ్బు ఆశతో బెట్టింగ్‌ వైపు చూస్తున్న విద్యార్థులు:
బుకీలు చూపే డబ్బు ఆశతో చాలా మంది విద్యార్థులు ఈ క్రికెట్‌ బెట్టింగ్‌ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో వివిధ ఫీజులు కావాలంటూ ఇంట్లో డబ్బులు అడిగే పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. బెట్టింగ్‌కు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే తమకు సమాచారం అందించాలని చెబుతున్నారు.

క్రికెట్‌ బెట్టింగ్‌ల వల్ల డబ్బంతా నష్టపోవడమే తప్ప ఎలాంటి లాభాలుండవు. సో..క్రికెట్‌ను చూస్తూ ఎంజాయ్‌ చేయండి..కానీ బెట్టింగ్‌ల పేరుతో డబ్బులు పోగొట్టుకుని బాధపడకండి. జీవితాలు నాశనం చేసుకోకండి.