నేరేడ్‌మెట్‌లో బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతం, బండచెరువు దగ్గర సుమేధ మృతదేహం గుర్తింపు

  • Published By: naveen ,Published On : September 18, 2020 / 12:52 PM IST
నేరేడ్‌మెట్‌లో బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతం, బండచెరువు దగ్గర సుమేధ మృతదేహం గుర్తింపు

హైదరాబాద్ నేరేడ్ మెట్ లో బాలిక మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. ఎవరూ ఊహించని ఘోరం జరిగిపోయింది. చిన్నారి సుమేధ నాలాలో పడి చనిపోయింది. బండచెరువు దగ్గర పోలీసులు పాప మృతదేహాన్ని గుర్తించారు. పాప ఇంటికి కిలోమీటర్ దూరంలో బండ చెరువు ఉంది. నిన్న(సెప్టెంబర్ 17,2020) సాయంత్రం 4.30 గంటల సమయంలో సైకిల్ పై బయటకు వెళ్లిన సుమేధ తిరిగి ఇంటికి రాలేదు.

కాగా, సుమేధ సైకిల్ మాత్రం నాలాలో లభ్యమైంది. సుమేధ కోసం పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది తీవ్రంగా గాలించారు. చివరికి పాప మృతదేహం కనిపించింది. తమ పాప నాలాలో పడే చాన్స్ లేదని, ఎవరో తీసుకెళ్లి ఉంటారని సుమేధ తల్లిదండ్రులు బలంగా నమ్మారు. కానీ, నాలానే పాపను మింగేసింది.

బండ చెరువులో సుమేధ మృతదేహం:
ఏ నాలా దగ్గర అయితే పాప సైకిల్ దొరికిందో, అక్కడే పాప పడిపోయి ఉంటుందని పోలీసులు భావించారు. అదే సమయంలో కిడ్నాప్ కోణంలోనూ ఎంక్వైరీ చేశారు. నాలా వెళ్లే చివరి స్టేజ్ బండ చెరువు. నాలా వెళ్లి బండ చెరువులో కలుస్తుంది. దీంతో పోలీసులు బండ చెరువు దగ్గర గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ ఓ చిన్నారి డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ఆ డెడ్ బాడీని చిన్నారి సుమేధదిగా గుర్తించారు.

నాలానే మింగేసింది:
నిన్నటి నుంచి 5 ప్రత్యేక పోలీసు బృందాలు చిన్నారి సుమేధ ఆచూకీ కోసం గాలించాయి. నగరంలో నిన్న భారీ వర్షం కురిసింది. దీంతో కాకతీయ నగర్ లో ఉన్న నాలా పొంగింది. కాకతీయ నగర్ లో మొదలయ్యే నాలా.. బండచెరువులో కలుస్తుంది. దీంతో పోలీసులు అక్కడ గాలింపు చేపట్టగా ఓ మృతదేహం కనిపించింది. ఒకవేళ పాప నాలాలో పడిపోయి ఉంటే, బండ చెరువులో తేలి ఉంటుందని అంతా భావించారు. పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది బండ చెరువు దగ్గరికి చేరుకున్నారు.

చిన్నారి సుమేధ ఇక లేదు అనే వార్త తల్లిదండ్రులను, స్థానికులను షాక్ కి గురి చేసింది. సుమేధ కుటుంబంలో విషాదం అలుముకుంది. సుమేధ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు సైతం తీవ్ర ఆవేదనలో ఉన్నారు. అయ్యో పాపం అని కన్నీటి పర్యంతం అయ్యారు. సుమేధ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందని అంతా నమ్మారు. కానీ, పాపను నాలానే మింగేసింది అనే తెలిసి బోరున విలపిస్తున్నారు. నిన్న సాయంత్రం సరదాగా ఆడుకోవడానికి బయటకు వెళ్లిన పాప తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అందరిని బాధించింది. కాగా, ప్రమాదవశాత్తు సుమేధ నాలాలో పడిపోయిందా? లేక ఎవరైనా నాలాలోకి తోసేశారా? అనేది తేలాల్సి ఉంది. ఆ దిశగా పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.