నిర్భయ కేసు చావు తెలివితేటలు : ఆ రోజు ఢిల్లీలో లేను – ముకేశ్ సింగ్

  • Published By: madhu ,Published On : March 18, 2020 / 01:43 AM IST
నిర్భయ కేసు చావు తెలివితేటలు : ఆ రోజు ఢిల్లీలో లేను – ముకేశ్ సింగ్

ఉరిశిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు ఆడని డ్రామా అంటూ లేదు. రకరకాల పిటిషన్లతో ఉరి శిక్షను తప్పించుకోవాడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో ఎత్తుగడ వేశారు. ముకేశ్‌ సింగ్  నిర్భయ ఘటన జరిగిన రోజున తాను ఢిల్లీలోలేనంటూ  దాఖలు చేసిన పిటిషన్‌పై పటియాల కోర్టు విచారణ జరిపింది. దీనిపై తీర్పును 2020, మార్చి 18వ తేదీ బుధవారానికి రిజర్వ్‌ చేసింది. డిసెంబర్‌ 17, 2012న రాజస్థాన్‌ నుంచి పోలీసులు తనని ఢిల్లీ తీసుకొచ్చారని పిటిషన్‌లో తెలిపాడు. తీహార్‌ జైలులో తనను చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించాడు. తనకు విధించిన మరణశిక్ష రద్దు చేయాలని పిటిషన్‌లో కోరాడు. 

నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్‌ ఠాకూర్‌ భార్య మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్డును ఆశ్రయించింది. భర్త నుంచి విడాకులు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఓ రేపిస్టుకు భార్యగా ఉండలేనని… తనకు విడాకులు కావాలంటూ పిటిషన్‌లో కోరింది. ఒక రేపిస్టుకు భార్య అనే అపవాదుతో తాను జీవించలేనని తెలిపింది. ఆమె పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. అయితే మార్చి 20న నిర్భయ దోషులకు ఉరివేయాలంటూ ఇప్పటికే పాటియాలా కోర్టు డెత్‌ వారెంట్‌  కూడా జారీ చేసింది. 

న్యాయపరమైన అవకాశాలు లేకపోవడంతో నిర్భయ దోషులు ఆఖరి అస్త్రంగా చివరకు అంతర్జాతీయ న్యాయస్థానం తలుపులు కూడా తట్టారు. తమకు ఉరిశిక్ష విధింపు చట్ట విరుద్ధమని, నిలిపివేయాలని ఐసీజేను కోరారు. దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ ఐసీజేలో పిటిషన్‌ దాఖలు చేశారు. మరణశిక్ష అమలు వాయిదా వేసేందుకు దోషులు న్యాయపరమైన అవకాశాల పేరిట  పిటిషన్లు దాఖలు చేయడంతో ఉరి అమలు తేదీ ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. తొలిసారి ఈ ఏడాది జనవరి 22న, ఫిబ్రవరి 1న రెండోసారి, మార్చి 2న మూడో సారి డెత్‌ వారెంట్లు జారీ అయినప్పటికీ ఉరి వాయిదా పడింది. ట్రయల్‌ కోర్టు మార్చి 5న జారీ చేసిన నాల్గవ డెత్‌ వారెంట్ అమలవుతుందా….లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
Read More : కరోనా రాకాసి : ఇటలీలో 2500 మంది మృతి