AAP National Party: 10 ఏళ్లలో జాతీయ పార్టీగా ఎదిగిన ఆప్.. దేశంలో తొమ్మిదవ జాతీయ పార్టీగా రికార్డ్

2014కి ముందు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్నా హజారే నేతృత్వంలో లేచిన లోక్‭పాల్ ఉద్యమంలో కేజ్రీవాల్ ఒకరు. అనంతరం, ఆయనకు రాజకీయంగా వచ్చిన సవాల్‭ను స్వీకరించి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆప్ స్థాపించిన అనంతరం ఎన్నికల గుర్తుకు అప్లై చేయగా, చీపురు కేటాయించారు

AAP National Party: 10 ఏళ్లలో జాతీయ పార్టీగా ఎదిగిన ఆప్.. దేశంలో తొమ్మిదవ జాతీయ పార్టీగా రికార్డ్

AAP

AAP National Party: మన దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే అందులో అతి తక్కువ పార్టీలకు మాత్రమే జాతీయ గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు దేశంలో ఎనిమిది పార్టీలు జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. కాగా, తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఈ ఎనిమిది జాతీయ పార్టీల్లో రెండు పార్టీలు జాతీయ స్థాయి గుర్తింపును కోల్పోయాయి. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. జాతీయ గుర్తింపు పొందిన తొమ్మిదవ జాతీయ పార్టీగా ఆప్ గుర్తింపు పొందింది.

ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన 10 ఏళ్లలో ఈ ఘనత సాధించింది. గతేడాది గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ 12.9 శాతం ఓట్లు సాధించింది. దీంతో ఆ పార్టీకి అప్పుడే జాతీయ హోదా ఖరారైంది. తక్కువ సమయంలో జాతీయ గుర్తింపు పొందిన పార్టీల్లో ఒకటిగా కూడా ఆప్ ఘనత సాధించింది. ప్రస్తుతం ఈ పార్టీ రెండు రాష్ట్రాల్లో (పంజాబ్, ఢిల్లీ) అధికారంలో ఉంది. గుజరాత్, గోవా అసెంబ్లీల్లో ఈ పార్టీకి సభ్యులు ఉన్నారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం లభించడంతో ఈ పార్టీకి జాతీయ గుర్తింపును ఇస్తున్నట్లు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

2014కి ముందు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్నా హజారే నేతృత్వంలో లేచిన లోక్‭పాల్ ఉద్యమంలో కేజ్రీవాల్ ఒకరు. అనంతరం, ఆయనకు రాజకీయంగా వచ్చిన సవాల్‭ను స్వీకరించి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆప్ స్థాపించిన అనంతరం ఎన్నికల గుర్తుకు అప్లై చేయగా, చీపురు కేటాయించారు. దీనిపై కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీల నుంచి హేళనలు వచ్చాయి. కానీ, వాటిని సవాలుగా తీసుకుని పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఢిల్లీని ఊడ్చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఆప్.. 70 స్థానాలకు గాను 28 స్థానాలు గెలిచింది. అయితే అప్పుడు కాంగ్రెస్, బీజేపీ గొడవ కారణంగా బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 49 రోజులకే రాజీనామా చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 67 స్థానాలు గెలిచి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఐదేళ్లకు మరోసారి ఘన విజయం సాధించింది.

ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..
ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం-1968 నిబంధనలకు లోబడి ఉండాలి. ఈ క్రింది మూడు నిబంధనల్లో కనీసం ఏదో ఒక నిబంధనను పూర్తిచేయాలి.
1. సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్‌ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై, చెల్లిన ఓట్లలో 6 శాతం ఓట్లు సాధించాలి. కనీసం ఒక రాష్ట్రం నుంచి నాలుగు లోక్‌సభ స్థానాలు గెలవాలి.
2. ఏవైనా నాలుగు రాష్ట్రాల నుంచి 11 లోక్‌సభ సీట్లు (2 శాతం సీట్లు) సాధించాలి. గెలుపొందిన అభ్యర్థులు కనీసం 3 రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.
3. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. జాతీయ పార్టీగా పేరు నమోదు చేసుకునే పార్టీ గుర్తు.. దేశంలోని మరే ఇతర పార్టీ చిహ్నంగా ఉండకూడదు.

ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..
ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ కింది నిబంధనల్లో కనీసం ఏదో ఒక నిబంధనను పాటించాలి.
1. రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో పోలై, చెల్లిన ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లు సాధించడంతోపాటు 2 అసెంబ్లీ స్థానాలు గెలవాలి.
2. ఆ రాష్ట్రంలో లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో పోలై, చెల్లిన ఓట్లలో 6 శాతం ఓట్లతోపాటు ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవాలి.
3. ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలవాలి.
4. ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3 శాతం ఓట్లు లేదా మూడు సీట్లు సాధించాలి.
5. లోక్‌సభ లేదా శాసనసభలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలై, చెల్లిన ఓట్లలో 8% వచ్చి ఉండాలి.

హోదా శాశ్వతం కాదు..
జాతీయ పార్టీగా లేదా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందితే ఆ హోదా శాశ్వతంగా ఉండదు. ఎన్నికల తరవాత ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి హోదా ఉండటం లేదా కోల్పోవడం జరుగుతుంది. ఈ కారణంగానే జాతీయ పార్టీల సంఖ్య, ప్రాంతీయ పార్టీల సంఖ్య తరుచూ మారుతుంది.