BJP-Shiv Sena : అమీర్ ఖాన్-కిరణ్ రావు లాంటిదే బీజేపీ-శివసేన బంధం

బీజేపీ- శివసేన మధ్య సంబంధాలు బాలీవుడు నటుడు ఆమీర్ ఖాన్, కిరణ్ రావుల వంటివేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

BJP-Shiv Sena : అమీర్ ఖాన్-కిరణ్ రావు లాంటిదే బీజేపీ-శివసేన బంధం

Sanjay Raut

BJP-Shiv Sena బీజేపీ- శివసేన మధ్య సంబంధాలు బాలీవుడు నటుడు ఆమీర్ ఖాన్, కిరణ్ రావుల వంటివేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. తామేమీ భార‌త్‌-పాకిస్తాన్ లాంటి వాళ్లం కాద‌ని.. త‌మ రెండు పార్టీల రాజ‌కీయ పంథాలు వేరైనా త‌మ మ‌ధ్య స్నేహ భావం ఎప్ప‌టికీ కొన‌సాగుతుంద‌ని చెప్పారు. అయితే శివ‌సేన-బీజేపీ పార్టీలు శ‌త్రువులు కాద‌ని ఆదివారం మ‌హారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సంజ‌య్ రౌత్ ఈ విధంగా త‌న‌దైన రీతిలో స్పందించారు. ఇక, తాను బీజేపీ నేత ఆశిష్ షెలార్ తో ఈ నెల 3 న సమావేశమైనట్టు వచ్చిన వార్తలను సంజయ్ రౌత్ ఖండించారు. ఇవి కేవలం ఊహాగానాలేనని సృష్టం చేశారు.

కాగా,మహారాష్ట్రలో ప్రస్తుతం అధికారంలో ఉన్న శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్​ కూటమి(మహా వికాస్ అఘాడి)కి బీటలు వారనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మహా వికాస్​ ఆఘాడీ ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేచే మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్​ ఉన్నట్టుండి స్వరం మార్చారు. బీజేపీ, శివసేనకు మధ్య శత్రుత్వం ఏమీ లేదని ఫడ్నవీస్ అన్నారు. తాజాగా శివసేన కీలక నేత సంజయ్​ రౌత్​ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం ఇరుపార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ఊహాగానాలను బలపరుస్తున్నాయి. ఫడ్నవీస్ ఇటీవల కేంద్ర మంత్రి అమిత్​ షాను కలిసిన సమయంలో శివసేనతో పొత్తు పెట్టుకునేందుకు సన్నాహాలు ప్రారంభించాలని సూచించినట్లు మహా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇటువంటి చర్చ జరుగుతున్న సమయంలో శివసేన-బీజేపీ నేతల ప్రకటనలు మహా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.