Satya Pal Malik : ఎన్నికల ముందు మోదీ ఎంతకైనా తెగిస్తాడు.. బాంబులు పేలొచ్చు, బీజేపీ నేత హత్య జరగొచ్చు : జమ్మూకాశ్మీర్‌ మాజీ గవర్నర్‌

ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీ పాలన కంటే అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు, ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోవడానికి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వే కారణమని ఆరోపించారు.

Satya Pal Malik : ఎన్నికల ముందు మోదీ ఎంతకైనా తెగిస్తాడు.. బాంబులు పేలొచ్చు, బీజేపీ నేత హత్య జరగొచ్చు : జమ్మూకాశ్మీర్‌ మాజీ గవర్నర్‌

Satya Pal Malik

Updated On : August 2, 2023 / 10:30 AM IST

Satya Pal Malik Comments PM Modi : ప్రధాని నరేంద్ర మోదీపై జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం మోదీ ఎంతకైనా తెగిస్తాడని పేర్కొన్నారు. ఎన్నికల ముందు బాంబులు పేలొచ్చు లేదా ఎవరైనా ప్రముఖ బీజేపీ నేత హత్య జరగవచ్చని సంచలన ఆరోపణలు చేశారు. తద్వారా ప్రజల సానుభూతి పొందడం కోసం పాకులాడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అయినా 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని వెల్లడించారు. ఎన్నికల తర్వాత మోదీ అడ్రస్ గల్లంతు అవ్వడం ఖాయం అన్నారు. ఈ మేరకు సత్యపాల్ మాలిక్ ఓ హిందీ వెబ్ సైట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అనుకూల వ్యక్తులకు మోదీ అంటే పడదన్నారు. వచ్చే ఎన్నికల్లో 200 ఎంపీ సీట్ల కన్నా తగ్గితే బీజేపీ నాయకులే మోదీని తప్పిస్తారని పేర్కొన్నారు.

HUT Terrorist Arrest : హైదరాబాద్, భోపాల్ మాడ్యూల్ కేసులో హెచ్ యూటీ ఉగ్రవాది సల్మాన్ అరెస్టు

యోగి అనుచరుల్లో ఒకరు తనతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. బీజేపీ పాలనపై ప్రజలు సంతోషంగా లేరని తెలిపారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్, మేఘాలయ, హర్యానా, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో బీజేపీకి ఓటమి తప్పదని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీ పాలన కంటే అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు, ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోవడానికి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వే కారణమని ఆరోపించారు. మణిపూర్ లో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రధాని మోదీ తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Manipur : మణిపుర్‌లో 3 నెలల్లో 30 మంది అదృశ్యం..6వేల జీరో ఎఫ్ఐఆర్‌లు

మణిపూర్ హింస ఘటనపై పార్లమెంట్ లో ప్రతిపక్షాలు నిలదీస్తున్నా.. మోదీ నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా రెజ్లర్లు రోజుల తరబడి ఆందోళన చేపట్టినా ప్రధాని మోదీ తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బేటీ బచావో అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ చుట్టూ అందరూ అవినీతి పరులే ఉన్నారని ఆరోపించారు. అంతేకాకుండా సీబీఐ, ఈడీ, ఐటి వంటి ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను తన చేతిలోకి తీసుకుని ప్రతిపక్షాలు, అసమ్మతులపైకి ఉసిగొల్పతూ భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మోదీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.