Karnataka Polls: కర్ణాటకలో ముదిరిన పాల యుద్ధం.. అసెంబ్లీ ఎన్నికలో బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదా?

మొన్నా మధ్య మహారాష్ట్రకు వచ్చిన పెట్టుబడులు గుజరాత్‭కు తరలించడంపై మహా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇదే కాకుండా.. మిగతా రాష్ట్రాలను పక్కన పెట్టి గుజరాత్ రాష్ట్రానికి బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందనే విమర్శ ఎలాగూ ఉంది. అమూల్ వర్సెస్ నందిని విషయంలోనూ ఇదే కనిపిస్తోంది.

Karnataka Polls: కర్ణాటకలో ముదిరిన పాల యుద్ధం.. అసెంబ్లీ ఎన్నికలో బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదా?

amool milk vs nandini milk

Karnataka Polls: కర్ణాటక రాష్ట్రంలో పాల యుద్ధం తీవ్ర స్థాయిలో ముదిరింది. అధికార పార్టీ, విపక్ష పార్టీలకు మధ్య మాటల ఫిరంగులు పేలుతున్నాయి. వచ్చే నెలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇది మరింత తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఈ అంశాన్ని కాంగ్రెస్, జేడీఎస్ కీలకంగా తీసుకున్నాయి. ఇప్పటికే బీజేపీ మీద ‘గుజరాత్ వ్యాపారులకు దేశాన్ని దోచి పెడుతున్నారు’ అనే విమర్శలు ఉన్న నేపథ్యంలో తాజా వివాదాన్ని సైతం దానికి ముడిపెట్టి కాషాయ పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Twitter Sign Viral : ట్విట్టర్ పేరులో ‘W’ అక్షరం మాయం.. ఇక ‘టిట్టర్’ అని పిలవాల్సిందేనట.. మస్క్ మాయాజాలం ఇదిగో..!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. పైగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని మెజారిటీ ఒపీనియన్ పోల్స్ తేల్చి చెప్పాయి. దీంతో కాంగ్రెస్ నుంచి వచ్చే విమర్శలు బీజేపీ మెడకు కత్తిలా వేలాడుతున్నాయి. ఇక జనతాదళ్ సెక్యూలర్(జేడీఎస్) రైతుల పార్టీగా గుర్తింపు ఉండడంతో.. ఈ అంశం మీద ఆ పార్టీ చేసే వ్యాఖ్యలపై చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఏ రకంగా చూసినా, అమూల్ వర్సెస్ నందిని పాల కాంట్రవర్సీలో బీజేపీ తీవ్రంగా ఇరుక్కుపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అసలు ఏంటీ పాల వివాదం?
కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్‌) ఆధ్వర్యంలో నడిచే నందిని పాలను గుజరాత్‭కు చెందిన అమూల్ పాలలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. క్రితంలో ఈ ప్రయత్నాలు తాము విఫలం చేసినప్పటికీ మళ్లీ ఆ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని వారి వాదన. ఒకవేళ అదే జరిగితే రాష్ట్రంలో పాడిపరిశ్రమపై ఆధారపడిన 28 లక్షల మంది రైతుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేందుకు జరుగుతున్న కుట్రని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక 45 లక్షల లీటర్ల ఉత్పత్తి ఉన్న పాలను రాష్ట్రంలో 75 లక్షల లీటర్లకు తీసుకువచ్చి పాడి రంగాన్ని అభవృద్ధి చేయడమే కాకుండా, నందిని పాలను అగ్ర స్థానంలో నిలబెట్టామని, ఇది కన్నడ ప్రజలకు గర్వకారణమని, అలాంటి నందిని పాలను అమూల్ పాలలో కలిపేసి కన్నడిగును అనాథలను చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విపక్ష నేత సిద్ధరామయ్య విమర్శించారు.

Asaduddin Owaisi: అల్లర్లు ఆపలేరు కానీ ఇఫ్తార్ విందులు చేసుకుంటున్నారు.. బిహార్ ప్రభుత్వంపై ఓవైసీ విమర్శలు

మొత్తానికి ఈ వివాదం ‘అమూల్ వర్సెస్ నందిని’గా మారింది. విపక్షాలు దీన్ని పెద్ద అస్త్రంగా చేసుకోవడానికి చాలా హడావుడే చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సోమవారం నందిని మిల్క్ సెంటర్ వద్దకు వెళ్లడం, అక్కడ ఆయన అమూల్ పాలపై విమర్శలు గుప్పించడం రాజకీయ ప్రకంపనలు రేపింది. అయితే విపక్షాలు చేస్తున్న ఈ హంగామా కేవలం రాజకీయమని, చిన్న విషయంపై ఆరోపణలు సృష్టించిన కావాలనే వివాదంగా మారుస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై విమర్శించారు. నందిని పాలు కన్నడిగుల గౌరవమని, దాని మీద ఈగ వాలనీయబోమని ఆయన తేల్చి చెప్పారు.

BRS Party: బోధన్ బీఆర్‌ఎస్‌లో వర్గపోరు.. ఎమ్మెల్యే, మునిసిపల్ ఛైర్‌పర్సన్ మధ్య ఫ్లెక్సీల వార్

దక్షిణాదికి చెందిన పలు రాష్ట్రాల పాల ఉత్పత్తుల విక్రయం ఇక్కడ జరుగుతున్నా ఎవరూ నోరు మెదపలేదని అముల్‌ విషయంలో మాత్రమే పేచీ ఎందుకని రాష్ట్ర బీజేపీ చీఫ్ నళిని కుమార్ కటిల్ విమర్శించారు. నందిని కన్నడిగులకు గర్వకారణమైన బ్రాండ్ అని, నందినికి సరిసమానంగా ఎవరూ పోటీలో నిలబడజాలరని బీజేపీ స్పష్టం చేసింది. అయినప్పటికీ నందిని వర్సెస్‌ అమూల్‌ వ్యవహారం ఎక్కడ చిక్కులు తెచ్చి పెడుతుందోనని కమలనాథులు లోలోపల ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో ఈ కాంట్రవర్సీ ప్రభావం ఎంత?
కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్ర-కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం సంచలనంగా మారింది. వాస్తవానికి ఇరు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ వివాదం మాత్రం తారా స్థాయిలోనే కొనసాగింది. దీనికి కారణం.. ఇరు రాష్ట్రాల్లోని విపక్షాల దాడే కారణమని వేరే చెప్పనక్కర్లేదు. అయితే మహారాష్ట్ర కంటే కర్ణాటకలో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. మహారాష్ట్ర సీఎం ఏక్‭నాథ్ షిండే దీనిపై అంత పెద్దగా స్పందించలేదు కానీ, కర్ణాటక సీఎం బొమ్మై మాత్రం మంత్రి మండలి సమావేశాలు నిర్వహించారు, అసెంబ్లీలో పలు ప్రకటనలు చేశారు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను కర్ణాటకలో కలపాలని కాస్త గట్టిగానే డిమాండ్ చేశారు. ఒక రకంగా కన్నడ అస్థిత్వాన్ని బలంగా చూపించాల్సి వచ్చింది.

Chhattisgarh: కంఠంలో ప్రాణముండగా మద్య నిషేధం కానివ్వనన్న ఎక్సైజ్ మంత్రి.. మిగతా నాయకులు ఈయనను ఆదర్శంగా తీసుకుంటే ఏంటీ పరిస్థితి?

తాజాగా అమూల్ వర్సెస్ నందిని విషయంలోనూ ఇదే కనిపిస్తోంది. మొన్నా మధ్య మహారాష్ట్రకు వచ్చిన పెట్టుబడులు గుజరాత్‭కు తరలించడంపై మహా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇదే కాకుండా.. మిగతా రాష్ట్రాలను పక్కన పెట్టి గుజరాత్ రాష్ట్రానికి బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందనే విమర్శ ఎలాగూ ఉంది. అందుకే గుజరాత్ బ్రాండ్ అయిన అమూల్‭లో కన్నడ నందినీని విలీనం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందనే అంశాన్ని విపక్షాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఆరు నెలల క్రితమే సరిహద్దు వివాదం పెద్ద ఎత్తున జరిగింది. దానికి తోడుగా తాజాగా పాల వివాదం సైతం ప్రాంతీయ బేధాల్ని చూపిస్తోంది. ఈ అంశం కన్నడిగులను ప్రభావితం చేయగలితే బీజేపీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటున్నారు. అయితే కన్నడిగులు ప్రాంతీయతపై అంతటి ప్రాధాన్యతను చూపిస్తారా లేదా అన్నది కూడా గమనించాల్సి ఉంది.