పేదలకే ప్రభుత్వాసుపత్రి : కరోనా సోకగానే ప్రైవేట్ హాస్పిటల్స్ కి పరుగెడుతున్న మంత్రులు

  • Published By: venkaiahnaidu ,Published On : August 3, 2020 / 10:03 PM IST
పేదలకే ప్రభుత్వాసుపత్రి : కరోనా సోకగానే ప్రైవేట్ హాస్పిటల్స్ కి పరుగెడుతున్న మంత్రులు

దేశవ్యాప్తంగా ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే లక్షల మంది ప్రజలు వైరస్ సోకగానే ప్రభుత్వాసుపత్రులకు వెళుతుంటే…వైరస్ సోకిన మంత్రులు,ఎమ్మెల్యేలు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. రోజూ గంటలపాటు ప్రభుత్వాసుపత్రులలోని సౌకర్యాల గురించి లెక్చర్లు దంచికొట్టే ప్రజాప్రతినిధులు తమకు వైరస్ సోకితే మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తున్నారు. ప్రభుత్వాసుపత్రికి ఎందుకు వెళ్లట్లేదు అని అడిగితే…కుంటి సాకులు చెప్తున్నారు మన నాయకులు.



ఆదివారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు కరోనా వైరస్ సోకినట్లు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. వెంటనే ఈ రాజకీయ నాయకుడు గురుగ్రామ్‌లోని ప్రైవేట్ హాస్పిటల్ మేదాంతలో చేరాడు. ఆ రోజు సాయంత్రం, కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప కరోనా వైరస్ సోకినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయన బెంగళూరులోని మణిపాల్(ప్రైవేట్ హాస్పిటల్) ఆసుపత్రిలో చేరారు.

తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కు కూడా ఆదివారం సాయంత్రం కరోనా సోకినట్లు తేలింది.ఆయనను హోమ్ ఐసొలేషన్ లో ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. అయితే గవర్నర్ కి కరోనా పరీక్షలు మరియు ఇతర మదింపులను ప్రైవేట్ ఫెసిలిటీ అయిన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో నిర్వహించారు.



వివిధ రాష్ట్రాలలో పలువురు మంత్రులు కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రులలో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వెళ్లారు. గత నెలలో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ కరోనా లక్షణాలు కనబడటంతో మొదట ప్రభత్వ హాస్పిటల్ లో చేరాడు. ఆయనకు పరీక్షలో మొదట నెగెటివ్ వచ్చింది. కాని రెండవ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. దెబ్బతో అయన ప్రభుత్వ ఆసుపత్రి వదిలేసి ప్రైవేట్ హాస్పిటల్ కి షిఫ్ట్ అయిపోయాడు. వైద్యులు తనకి ప్లాస్మా థెరపీని సిఫారసు చేసారని,అయితే ప్రభుత్వ ఆసుపత్రికి ఆ సమయంలో కేంద్రం నుండి చికిత్స నిర్వహించడానికి అనుమతి లేదని,అందుకే తాను ప్రైవేట్ హాస్పిటల్ కి మారినట్లు అయన చెప్పారు.

అయితే ఇక్కడ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. గతనెల 18న కరోనా వైరస్ సోకడంతో లక్నోలోని ప్రభుత్వ హాస్పిటల్ లో చేరిన ఉత్తర ప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమల్ రాణి వరుణ్ (62) ఆదివారం మరణించిన విషయం తెలిసిందే.



మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా సోకినా ప్రజాప్రతినిధులందరు ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్తున్నారు తప్ప ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లట్లేదు అన్న విషయం తెలిసిందే.