PM Modi: ప్రధానితో అస్సాం సీఎం సమావేశం.. సరిహద్దు సమస్యలపై చర్చ

అస్సాం-మిజోరం సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ.. ఇటీవల ఇదే అంశంపై జరిగిన హింసలో ఆరుగురు అస్సాం పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

PM Modi: ప్రధానితో అస్సాం సీఎం సమావేశం.. సరిహద్దు సమస్యలపై చర్చ

Modi

Assam CM Himanta Biswa Sarma: అస్సాం-మిజోరం సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ.. ఇటీవల ఇదే అంశంపై జరిగిన హింసలో ఆరుగురు అస్సాం పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఆసక్తికర భేటీకి రంగం సిద్ధమైంది. ప్రధాని మోడీతో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ భేటీ కాబోతున్నారు. అసోం-మిజోరాం సరిహద్దుల వ్యవహారం, ఈశాన్య ప్రాంతాల్లో శాంతి పునరుద్ధరణపై కీలకంగా చర్చ జరగనుంది. సీఎం శర్మతో పాటు అసోం బీజేపీ ఎంపీలు కూడా ప్రధానిని కలుసుకోనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లుగా అందరూ భావించినా అది సాధ్యం కాలేదు. కాసేపట్లో ప్రధానిని కలవనున్నారు. అసోం- మిజోరాం రాష్ట్రాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణంకు కేంద్రం ఫుల్ స్టాప్ పెడుతుందని భావిస్తున్నారు. ఇటీవల సరిహద్ధు వివాదం నేపథ్యంలో మిజోరాం పోలీసులు అస్సాం పోలీసులపై కాల్పులు జరపడం, ఆ కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మరణించడం, ఆ తరువాత ఇరు రాష్ట్రాలు వివాద పరిష్కారానికి కేంద్రం సాయం కోరడం చకచకా జరిగిపోయాయి.

ఈ క్రమంలో అసలు సరిహద్దు సమస్యకు పరిష్కారం ఏంటనేది ముఖ్యమంత్రితో సమావేశంలో మోడీ చర్చించనున్నారు. దీంతోపాటు అసలు సమస్యకు కారణమైన బ్రిటీషర్ల విధానాలు, సరిహద్దు వివాదం మూలాలు తెరపైకి రాగా.. ఈశాన్య రాష్ట్రాల మధ్య వివాదాలు, ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల వైఖరి ఈ సమావేశంలో చర్చకు రానుంది. సరిహద్దు వివాదాలు పెద్దవి కావడానికి కారణం ఆయా రాష్ట్రాలు నెరిపే రాజకీయాలేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అస్సాం నుంచి విడిపోయిన నాలుగు రాష్ట్రాల సరిహద్దులను రాజ్యాంగబద్ధంగా నిర్దేశించినప్పటికీ, చారిత్రకంగా తమ సమాజానికి సంబంధించిన భూములను కోల్పోయామనే భావన నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ వాసుల్లో ఉంది. దీంతో తమ వనరులు కోల్పోవడానికి సిద్ధంగా లేని రాష్ట్రాలు, సరిహద్ధుల్లోని భూభాగాలపై హక్కులు కోరుతున్నాయి. ఈ క్రమంలోనే అస్సాం-మిజోరాం సరిహద్దుల్లో హింస జరిగిన పరిస్థితి.