ఢిల్లీకి ఉపశమనం : నవంబర్ 6 తర్వాత కాలుష్యం తగ్గుతుంది 

  • Published By: chvmurthy ,Published On : November 2, 2019 / 09:53 AM IST
ఢిల్లీకి ఉపశమనం : నవంబర్ 6 తర్వాత కాలుష్యం తగ్గుతుంది 

దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోయిన వాయు కాలుష్యం ఒకటి రెండు రోజుల్లో తగ్గు ముఖం పడతుందని భారత వాతారణశాఖ అధికారి కేవీ సింగ్ చెప్పారు. శనివారం గాలి అతి తక్కువగా ఉందని, ఈ రోజు నుండి గాలి పెరిగే అవకాశం ఉందని, నవంబర్ 6 తర్వాత గాలి దిశ మారుతుందని ఆయన వివరించారు. అప్పుడు వర్షాలు కూడా పడతాయని చెప్పారు. వర్షాలు పడటం మొదలైతే ప్రజలకు ఉపశమనం లభిస్తుందని ఆయన అన్నారు. 

దీపావళి తర్వాత దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరగటంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. శుక్రవారం, నవంబర్1నాటి లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరంగా ఢిల్లీ నిలిచింది. నవంబరు 5 వరకు స్కూళ్లకు  సెలవులు ప్రకటించారు. ఓ వైపు పొరుగు పొరుగున ఉన్న పంజాబ్‌, హర్యానా రాష్ర్టాల్లో నుంచి పంట వ్యర్థాలను దగ్ధం చేయటం.. మరోవైపు దీపావళి బాణసంచాల పేలుళ్లు. ఇంకోవైపు వాహనాల నుంచి వెలువడే పొగ – అన్ని కలిపి ఢిల్లీ కాలుష్యాన్ని ప్రమాద స్థాయికి చేర్చాయి. దీంతో ఢిల్లీ కాలుష్యానికి  కేరాఫ్ అడ్రస్ గా మారి, కాలుష్య స్థాయి ప్రమాదకర స్థితికి చేరుకుంది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఢిల్లీ-ఎన్ సీఆర్ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.  

గాలిలో నాణ్యతా ప్రమాణాలు ప్రమాదకర స్థితికి దిగజారగా.. శుక్రవారం ఏక్యూఐ(గాలి నాణ్యతా సూచీ) రికార్డు స్థాయిలో 599కు చేరుకోవడంతో హెల్త్ ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ, పర్యావరణ కాలుష్య నియంత్రణ సంస్థ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నాయి. కాగా గతేడాది జనవరి తర్వాత గాలిలో నాణ్యతా ప్రమాణాలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. ఈ పరిస్ధితిని అధిగమించటానికి ఢిల్లీ ప్రభుత్వం  50లక్షల మాస్క్‌లను పంపిణీ చేస్తోంది. మాస్క్ లేకుండా ఎవరూ బయటకు రావద్దని సీఎం కేజ్రీవాల్ ప్రజలను కోరారు. వాయు కాలుష్యం తగ్గించేందుకు సోమవారం నవంబర్ 4 నుంచి ఢిల్లీలో సరిబేసి విధానాన్ని అమలు చేయనున్నారు.