Black Fungus : మళ్లీ బ్లాక్ ఫంగస్ కలకలం.. యూపీలో తొలి కేసు నమోదు
అసలే కరోనా మహమ్మారి టెన్షన్ పెడుతుంటే, ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మళ్లీ బ్లాక్ ఫంగస్.. కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది.

Black Fungus
Black Fungus : దేశంపై మరోసారి కరోనావైరస్ మహమ్మారి పంజా విసిరింది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజూ లక్షల్లో నమోదవుతున్న కరోనా కేసులతో జనాల్లో ఆందోళన నెలకొంది. ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ హడలెత్తిస్తున్నాయి. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతా వర్రీ అవుతున్నారు. అసలే కరోనా మహమ్మారి టెన్షన్ పెడుతుంటే, ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మళ్లీ బ్లాక్ ఫంగస్.. కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. గతేడాది సెకండ్ వేవ్‌లో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కలవరానికి గురి చేసిన సంగతి తెలిసిందే.
ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్‌తో లక్షణాలతో సోమవారం ఆసుపత్రిలో చేరాడు. అతడి ఒక కన్ను, ముక్కుకు బ్లాక్ ఫంగస్ వ్యాపించింది. కరోనా థర్డ్ వేవ్ లో ఇదే తొలి కేసు అని అధికార వర్గాలు తెలిపాయి. కాంట్ ప్రాంతానికి చెందిన 45 సంవత్సరాల వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకిందని, అతనికి మధుమేహం ఉందని జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ కాలా చెప్పారు.
Covid New Guidelines: కొవిడ్ కొత్త మార్గదర్శకాలు.. ఆగకుండా దగ్గు వస్తే టీబీ పరీక్ష చేయించుకోండి
కంట్లో నొప్పిగా ఉందని ఆ వ్యక్తి వచ్చాడని, అతడికి టెస్టు చేయగా, కరోనా సోకినట్లు తేలిందని డాక్టర్ తెలిపారు. షుగర్ కారణంగా ఆ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు భావిస్తున్నామన్నారు. బాధితుడిని బ్లాక్ ఫంగస్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. హలాత్ లో ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఏడాది కాలంలో కొంతమంది మాత్రమే బ్లాక్ ఫంగస్ తో ఆసుపత్రికి వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం హలాత్ ఆసుపత్రిలో ఆరుగురు కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. కాన్షీరామ్ ఆసుపత్రిలో ఇద్దరు కరోనా బాధితులు ఉన్నారు.
సెకండ్ వేవ్ సమయంలో బ్లాక్ ఫంగస్ బెంబేలెత్తించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూశాయి. ఫంగస్ కారణంగా పలువురు కంటి చూపును సైతం కోల్పోయారు. మరోసారి బ్లాక్ ఫంగస్ కేసు నమోదవడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవాలని, స్టెరాయిడ్లు ఇష్టమొచ్చినట్లు కాకుండా జాగ్రత్తగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.
మరోవైపు కోవిడ్ చికిత్స కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. స్వల్ప, మధ్య, తీవ్ర లక్షణాలు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. కోవిడ్ రోగులకు స్టెరాయిడ్స్ ఇవ్వడం ఆపేయాలని డాక్టర్లకు నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పౌల్ సూచించారు. సెకండ్ వేవ్ సమయంలో స్టెరాయిడ్స్ అధికంగా వాడినట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్టెరాయిడ్స్‌తో సెకండరీ ఇన్‌ఫెక్షన్ పెరుగుతుందని, సుదీర్ఘకాలం ఎక్కువ డోసులో స్టెరాయిడ్స్‌ను వాడితే బ్లాక్ ఫంగస్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఒకవేళ రెండు లేదా మూడు వారాల కన్నా ఎక్కువ సమయం దగ్గు వస్తుంటే, కచ్చితంగా టీబీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Asteroid : భూమి వైపు దూసుకొస్తున్న డేంజరస్ ‘గ్రహశకలం’
* ఊపిరి సమస్యలు లేకుండా కేవలం శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉంటే వాటిని స్వల్ప లక్షణాలుగా పరిగణించాలి.
* వాళ్లు కేవలం హోమ్ ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుంది.
* ఇక మధ్య తరహా లక్షణాలు ఉన్నవారు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడితే, జ్వరం అధికంగా ఉంటే, 5 రోజుల కన్నా ఎక్కువ కాలం దగ్గు కొనసాగితే, డాక్టర్ ను సంప్రదించాలి.
* ఆక్సిజన్ లెవల్ 90-93 మధ్య ఉంటే మాడరేట్ కేసులుగా భావిస్తారు. వారికి ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వాలి.
* ఇక ఆక్సిజన్ లెవల్ 90 కన్నా తక్కువగా ఉంటే వారిని తీవ్ర లక్షణాలు ఉన్న వ్యక్తిగా పరిగణించాలి. అలాంటి వాళ్లను తక్షణమే ఐసీయూలో చేర్పించాలి.
దేశంలో కరోనా మహమ్మారి కాస్త శాంతించింది. నిన్నటితో పోలిస్తే 20,071 కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,38,018 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనాతో మరో 310 మంది మరణించారు. కొత్తగా 1,57,421 మంది బాధితులు కోలుకున్నారు.