మంచుకొండ‌ల్లో ర‌క్తం : భార‌త్ – చైనా వివాదం ఏంటీ

  • Published By: madhu ,Published On : June 17, 2020 / 02:27 AM IST
మంచుకొండ‌ల్లో ర‌క్తం : భార‌త్ – చైనా వివాదం ఏంటీ

మంచుకొండ‌లు ఎర్ర‌టి ర‌క్తంతో త‌డిసిపోయాయి. నాలుగున్న‌ర ద‌శాబ్దాల ఉన్న ప్ర‌శాంత‌త భ‌గ్నం అయ్యింది. తూర్పు ల‌ద్దాఖ్ లో భార‌త్ – చైనా సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. ఒక‌రు..కాదు..ఇద్ద‌రు..కాదు..20 మంది భార‌తీయ సైనికులను పొట్ట‌న‌పెట్టుకుంది. మ‌రో 10 మంది సైనికుల ఆచూకీ తెలియ‌డం లేదు. ఇరువైపులా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 43 మంది సైనికులు చ‌నిపోయార‌ని అంచ‌నా.

చైనా సైనికులు ప్ర‌ణాళిక ప్ర‌కారం..దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది. రాళ్లు, ఇనుప క‌డ్డీలు, క‌ర్ర‌ల‌తో పెట్రేగిపోయారు. ఫ‌లితంగా అక్క‌డ ఇరు సైనికుల ర‌క్తం చిందింది. ఈ దుశ్చ‌ర్య‌ను భార‌త సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారు. వారితో బాహాబాహికి దిగారు. ఈ ఘ‌ట‌న‌లో తెలంగాణ వాసి సంతోష్ తో స‌హా..20 మంది సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు. 

తాజాగా…ఉద్రిక్త‌త‌ల‌ను చ‌ల్లార్చ‌డానికి రెండు దేశాల సైనిక అధికారులు రంగంలో దిగారు. మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అధికారుల స్థాయిలో ఘ‌ట‌నా స్థ‌లంలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప‌రిస్థితిని శాంతింప చేయ‌డానికి రెండు దేశాల సీనియ‌ర్ మిల‌ట‌రీ అధికారులు ఘ‌ట‌నా స్థ‌లంలో స‌మావేశ‌య్యార‌ని సైన్యం వెల్ల‌డించింది. గాల్వాన్ ప‌రిణామంపై చైనా త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేసింది. 

భార‌త దేశం –  చైనా మ‌ధ్య దాదాపు 3500 కిలో మీట‌ర్ల పొడ‌వున ఉన్న ఎల్ ఐసీ పై ఇరు దేశాల మ‌ధ్య వివాదం నెల‌కొంది.  1962లో రెండు దేశాల మ‌ధ్య యుద్ధం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. స‌రిహ‌ద్దు స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యే వ‌ర‌కు అక్క‌డ శాంతిని నెల‌కొల్పాల‌ని రెండు దేశాలు నిర్ణ‌యించాయి.

కొన్ని ద‌శాబ్దాలుగా ప్ర‌శాంత‌త ఉండేది. కానీ కొన్ని రోజుల నుంచి…చైనా భారీగా మౌలిక వ‌స‌తుల‌ను, సైనిక మార్గాల‌ను, రైలు మార్గాల‌ను నిర్మిస్తోంది. ధీటుగా భార‌త్‌…మౌలిక వ‌స‌తుల‌ను నిర్మించుకొంటోంది. ఇది చైనాకు కంట‌గింపుగా మారింది. ఇటీవ‌లే పాంగాంగ్ స‌ర‌స్సులోని ఫింగ‌ర్ ప్రాంతాల వ‌ద్ద కీల‌క రోడ్డును నిర్మిస్తోంది. గాల్వాన్ లోయ‌లో దార్బుక్ ష్యోక్ దౌల‌త్ బేగ్ ఓల్డీల‌ను సంధానిస్తూ..రోడ్డును నిర్మిస్తోంది. వీటిపై చైనా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. 

గ‌త నెల 5, 6 తేదీల్లో  పాంగాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద ఇరు దేశాల సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఇరుప‌క్షాల మ‌ధ్య 100 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. భార‌త భూబాగంలోకి ప్ర‌వేశించిన చైనా సైనికులు గుడారాలు వేసుకున్నారు. భార‌త్ కూడా అదే స్థాయిలో మోహ‌రింపులు చేసింది. ఈ ప‌రిస్తితుల్లో సైనిక‌, దౌత్య స్థాయిలో చ‌ర్చ‌లు కొన‌సాగించాయి. 

Read: అమ‌రుడైన తెలంగాణ బిడ్డ‌..క‌ల్న‌ల్ సంతోష్ జీవిత విశేషాలు