కరోనా మరణాల్లో ప్రపంచంలో 7వ స్థానంలోకి భారత్, స్పెయిన్‌ను దాటేసింది

  • Published By: naveen ,Published On : July 22, 2020 / 10:34 AM IST
కరోనా మరణాల్లో ప్రపంచంలో 7వ స్థానంలోకి భారత్, స్పెయిన్‌ను దాటేసింది

భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్ధాయి కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న(జూలై 21,2020) ఒక్కరోజే 37వేల 724 పాజిటివ్‌ కేసులు, 648 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 11లక్షల 92వేల 915కు చేరింది. ఇప్పటివరకు 28వేల 732 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 7లక్షల 53వేల 050 మంది రోగులు కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 4లక్షల 11వేల 133. తాజా లెక్కలతో భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్న దేశాల జాబితాలో 7వ స్థానానికి చేరింది. ఇప్పటివరకు 28వేల 400 మరణాలతో ఈ స్థానంలో ఉన్న స్పెయిన్‌ ప్రస్తుతం 8వ స్థానంలోకి వెళ్లింది. కొవిడ్‌ కేసుల్లో మాత్రం భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది.

22 రోజుల్లోనే 6లక్షల కేసులు, 11వేల మరణాలు:
దేశంలో మార్చి నెలలో మొదలైన కరోనా వైరస్‌ కేసుల సంఖ్య ప్రతి నెల పెరుగుతూ వస్తోంది. మే నెలలో లక్షా 50వేల కేసులు నమోదు కాగా దాదాపు నాలుగు వేల మరణాలు సంభవించాయి. జూన్‌ నెలలో తీవ్రత పెరగడంతో దాదాపు 4లక్షల కేసులు, 11వేల మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం వైరస్‌ మరింతగా విజృంభిస్తుండడంతో జులైలో ఈ 22 రోజుల్లోనే దాదాపు 6 లక్షల కేసులు నమోదు కాగా ఇప్పటికే 11వేల మరణాలు చోటుచేసుకున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న కేసులు, మరణాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాగా ప్రజలందరూ జాగ్రత్తలను కచ్చితంగా పాటిస్తేనే కరోనాను కట్టడి చేయగలం అని అధికారులు చెబుతున్నారు.

3లక్షల 27వేల కేసులతో టాప్‌లో మహారాష్ట్ర:
మన దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్ లో ఉంది. 3లక్షల 27వేల 31 కరోనా కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత తమిళనాడు(లక్షా 80వేల 643 కరోనా కేసులు), ఢిల్లీ(లక్షా 25వేల 96 కేసులు) ఉన్నాయి. మహారాష్ట్రంలో ఇప్పటివరకు 12వేల 276మంది కరోనాతో మరణించారు. లక్షా 82వేల 217మంది కోలుకున్నారు. తమిళనాడులో ఇప్పటివరకు 2వేల 626 మంది మరణించారు. లక్షా 26వేల 670మంది కోలుకున్నారు. ఢిల్లీలో 3వేల 690 మంది కరోనాతో చనిపోయారు. లక్షా 6వేల 118మంది కోలుకున్నారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 63.1శాతంగా ఉంది.