75th Independence Day: 1 నుంచి 101 వరకు అద్భుతమైన జర్నీ.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ప్రస్థానం..
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనను కనబరుస్తూ వస్తున్నారు. ఒక్క పతకం నుంచి 101 పతకాలను గెలచుకొని భారత్ క్రీడాకారుల సత్తాను ప్రపంచానికి చాటారు.

Indian sports persons who excelled in the Commonwealth Games
75th Independence Day: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనను కనబరుస్తూ వస్తున్నారు. ఒక్క పతకం నుంచి 101 పతకాలను గెలచుకొని భారత్ క్రీడాకారుల సత్తాను ప్రపంచానికి చాటారు. తాజాగా బర్మింగ్ హోమ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో మరోసారి భారత క్రీడాకారులు సత్తాచాటారు. కామన్వెల్త్ గేమ్స్ -2022లో మొత్తం 61 పతకాలు సాధించడంతో.. పతకాల పట్టికలో భారత్ నాల్గో స్థానంలో నిలిచింది. వాటిలో 22 స్వర్ణాలు, 16 రజత, 23 కాంస్య పతకాలను క్రీడాకారులు గెలుచుకున్నారు. భారత్ నుంచి బ్రిటీష్ వారిని తరమికొట్టి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కామన్వెల్త్ గేమ్స్ లో భారత పతకాల పట్టికలో అంచెలంచెలుగా ఎదిగిన తీరును ఓ సారి పరిశీలిద్దాం..
కామన్వెల్త్ గేమ్స్‌కు 1930లో బీజం పడింది. భారతదేశం 1934లో రెండవ గేమ్‌లలో మొదటిసారి పాల్గొంది. 2010లో కామన్వెల్త్ గేమ్స్ కు భారత్ భాగస్వామ్యం వహించడంతో భారతీయ అథ్లెట్లు తమ సత్తాను చాటారు. ఇప్పటి వరకు భారత క్రీడాకారులు ఆడిన కామన్వెల్త్ గేమ్స్ లో అత్యంత విజయవంతమైన ఈవెంట్ ఇదే. ఈ ఈవెంట్ లో భారత క్రీడాకారులు 38 బంగారు, 27 రజత, 36 కాంస్య పతకాలను గెలుచుకొని 101 పతకాలు సాధించి తొలిసారి వంద మార్క్ పతకాలను అధిగమించారు.
కామన్వెల్త్ క్రీడలకు 1930లో ప్రారంభమయ్యాయి. అయితే తొలిసారి 1934లో లండన్ లో జరిగిన క్రీడల్లో రషీద్ అన్వర్ పాల్గొని పురుషుల 74 కేజీల విభాగంలో తొలిసారి కాంస్యం పతకాన్ని అందుకున్నారు. 1938లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు పాల్గొన్నారు. అయినా ఎలాంటి పతకాలు దక్కలేదు. 1942, 1946 సంవత్సరాల్లో రెండవ ప్రపంచ యుద్ధం వల్ల కామన్వెల్త్ క్రీడలు జరగలేదు.
తిరిగి 1950లో ఈవెంట్ జరిగిన భారత్ పాల్గొనలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కెనడాలో జరిగిన 1954 పోటీల్లో భారత్ పాల్గొంది. అయితే ఒక్క పతకాన్ని క్రీడాకారులు సాధించలేక పోయారు. మళ్లీ 1958లో వేల్స్ లో జరిగిన క్రీడలతో భారత్ ప్రస్థానం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ క్రీడల్లో తొలిసారి భారత్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. మొత్తం మూడు పతకాలు సాధిస్తే.. రెండు బంగారు, ఒక రజతాన్ని క్రీడాకారులు దక్కించుకున్నారు.
1966లో జమైకా వేదికగా ఐదో కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ పది పతకాలు సాధించింది. అందులో మూడు స్వర్ణాలు ఉన్నాయి. అ ఈవెంట్ లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 1970లో స్కాట్లాండ్ లో జరిగిన పోటీల్లో 12 పతకాలు, 1974లో 15 పతకాలు, 1978లో 15 పతకాలు, 1982లో 16 పతకాలను సాధించింది. ఇక 1990లో న్యూజీలాండ్ వేదికగా జరిగిన పోటీల్లో భారత్ 32 పతకాలతో టాప్ 5 దేశాల సరసన చేరింది. 1994లో 24 పతకాలతో ఆరో స్థానంలో, 1998లో 25 పతకాలు సాధించి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. మళ్లీ 2002లో భారత్ పుంజుకుంది. ఈ క్రీడల్లో తొలిసారి 50 పతకాల మార్క్ అందుకుంది. ఈ టర్నీలో 30 బంగారు పతకాలను భారత్ క్రీడాకారులు దక్కించుకున్నారు. 2006లో మెల్ బోర్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ 50 పతకాలు దక్కించుకోగా అందులో 22 బంగారు పతకాలు ఉన్నాయి.]
2010 సంవత్సరం భారత్ క్రీడాకారులకు గుర్తుండే సంవత్సరం. ఈ ఏడాది స్వదేశంలో కామన్వెల్త్ గేమ్స్ జరగగా భారత్ క్రీడాకారులు సత్తాఏమిటో చాటారు. ఏకంగా 100 పతకాల మార్కును అదిగమించి 101 పతకాలను గెలుచుకున్నారు. వీటిలో 38 బంగారు పతకాలు ఉన్నాయి. ఆ తరువాత 2014లో జరిగిన గేమ్స్ లో 64 పతకాలను భారత్ క్రీడాకారులు గెలుచుకున్నారు. ఇందులో 15 బంగారు పతకాలు ఉన్నాయి. ఇక 2018లో ఆసీస్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ క్రీడాకారులు 66 మెడల్స్ గెలుచుకున్నారు. ఇందులో స్వర్ణాలు 26 ఉన్నాయి. రజతాలు 20, కాంస్య పతకాలు 20 ఉన్నాయి. ఇక బర్మింగ్ హోమ్ వేదికగా 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ 61 పతకాలు సాధించింది. ఇందులో 22 స్వర్ణాలు ఉన్నాయి. అయితే పతకాల పట్టికలో భారత్ నాల్గో స్థానంలో నిలిచింది