తగ్గనున్న వాహనాల ధరలు..

  • Published By: bheemraj ,Published On : August 1, 2020 / 08:45 PM IST
తగ్గనున్న వాహనాల ధరలు..

వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. కొత్తగా కారు లేదా బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఊరట లభించనుంది. (ఆగస్టు 1, 2020) నుంచి దేశంలో కొత్త ఇన్సూరెన్స్ నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాహన ధరలు దిగి రానున్నాయి.



వినియోగదారులకు భారంగా మారిన లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను కొత్త నిబంధనల ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీలు ఉపసంహరించుకోనున్నాయి. దీంతో వినియోగదారులు మూడు లేదా ఐదు సంవత్సరాల దీర్ఘకాలిక బీమా పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కొత్త నిబంధన (ఆగస్టు 1, 2020) తర్వాత కొనుగోలు చేసే వాహనాలకు వర్తిస్తుంది. దీంతో ఇకపై కారు, లేదా బైక్ కొనే వారు మూడేళ్లు లేదా ఐదేళ్లకు కాకుండా ఒక ఏడాదికే వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అయితే ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఈ పాలసీని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.



ఫలితంగా వెహికల్ ఆన్‌రోడ్ ధర కూడా దిగి వస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా కారు లేదా టూవీలర్ కొనుగోలు చేసే వారికి తొలి ఏడాది ఇన్సూరెన్స్ భారం తగ్గుతుంది. అంతేకాకుండా, కస్టమర్లు ఎక్కువ కాలం ఒకే బీమా కంపెనీకి కట్టుబడి ఉండాల్సి అవసరం లేదు. ఇతర బీమా సంస్థలకు కూడా మారవచ్చు.

కాగా వాహన యజమానులు టూ వీలర్ వాహనాలకు ఐదేళ్లు, ఫోర్ వీలర్స్ వాహనాలకు మూడేళ్లు దీర్ఘకాలిక పాలసీని 2018లో సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. ఇది భారమవుతోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుత నిబంధనలను ఐఆర్‌డీఏఐ తీసుకొచ్చింది.