కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు లేవు : గవర్నరే ఆహ్వానించారన్న రాహుల్

  • Published By: venkaiahnaidu ,Published On : August 24, 2019 / 02:48 PM IST
కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు లేవు : గవర్నరే ఆహ్వానించారన్న రాహుల్

కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు లేనట్లు అర్థమవుతోందని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఇవాళ కశ్మీర్‌ వ్యాలీలో పర్యటించేందుకుగాను రాహుల్ నేతృత్వంలో విపక్ష నేతల బృందం శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే… వారిని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయంటూ అక్కడి పోలీసులు వారిని కశ్మీర్‌లోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. అనంతరం వారిని తిరిగి ఢిల్లీకి పంపించేశారు. 

ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ నన్ను కశ్మీర్‌ కు ఆహ్వానించారు.న ఆయన ఆహ్వానం మేరకే నేను వస్తే.. ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న  పరిస్థితుల్ని తెలుసుకొనేందుకు తాము వెళ్లాలని ప్రయత్నిస్తే విమానాశ్రయంలోనే అడ్డుకున్నారని రాహుల్‌ విమర్శించారు. తమ వెంట వెళ్లిన మీడియా ప్రతినిధులపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.  

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి భయానకంగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై తమ విమానంలో ఎక్కిన కొందరు ప్రజలు చెబుతున్న అనుభవాలను వింటుంటే రాళ్లకు కూడా కన్నీళ్లు తెప్పించేవిగా ఉన్నాయని అన్నారు. 
ఆర్టికల్ 370రద్దును కాంగ్రెస్,సీపీఐ,ఆర్జేడీ,సీపీఎం,ఎన్సీపీ తదితర పార్టీలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కశ్మీరీల మనోభావాలను తెలుసుకోకుండా,ప్రతిపక్షాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.