ఈ సమ్మర్ చాలా హాట్ గురూ, సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

ఈ సమ్మర్ చాలా హాట్ గురూ, సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

this summer very hot: సమ్మర్ అంటే చాలు.. జనాలకు ఒళ్లంతా చెమట్లు పట్టేస్తున్నాయ్. నిప్పులు కురిపించే వేసవిని తలుచుకుని వణికిపోతున్నారు. ఈసారి ఎండలు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) జనాలకు చెమట్లు పట్టించే వార్త చెప్పింది. ఈ సమ్మర్ చాలా హాట్ గురూ అని ఐఎండీ తేల్చింది.

ఈ ఏడాది(2021) వేసవి కాలంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మార్చి-మే మధ్య ఎండలు ఎలా ఉండబోతున్నాయన్న అంచనాను సోమవారం(మార్చి 1,2021) ఆ సంస్థ వెల్లడించింది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో పగటి పూట భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని తెలిపింది. దక్షిణ, మధ్య భారత్‌లో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగానే ఉండొచ్చని అంచనా వేసింది.

అయితే… తూర్పు, పశ్చిమ ప్రాంతాలతో పాటు, సముద్ర తీరాల దగ్గర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిశా తీర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర భారతంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగానే ఉండొచ్చంది. ఏప్రిల్‌-జూన్‌కి సంబంధించిన వేసవి అంచనాలను ఏప్రిల్‌లో విడుదల చేస్తామని ఐఎండీ తెలిపింది.

ఈ సమ్మర్ చాలా హాట్ గా ఉండొచ్చని, అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే చాన్స్ ఉందని ఐఎండీ వేసిన అంచనా జనాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మాడు పగిలిపోయే ఎండలు ఈసారి కూడా తప్పవేమో అని వర్రీ అవుతున్నారు. కాగా, అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పెరిగాయ్. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండవేడికి జనాలు విలవిలలాడుతున్నారు. స్టార్టింగ్ లోనే ఈ రేంజ్ లో సూర్యుడు మండిపోతున్నాడంటే, ముందు ముందు మంటలు పుట్టిస్తాడని ఆందోళన చెందుతున్నారు.