Antony Blinken : మోదీతో బ్లింకన్ భేటీ..భారత్ కు మరోసారి అమెరికా భారీ సాయం

కోవిడ్ ఉధృతి నేపథ్యంలో భారత్​కు మరోసారి భారీ సాయం ప్రకటించింది అమెరికా.

Antony Blinken : మోదీతో బ్లింకన్ భేటీ..భారత్ కు మరోసారి అమెరికా భారీ సాయం

Modi Blinken

Antony Blinken కోవిడ్ ఉధృతి నేపథ్యంలో భారత్​కు మరోసారి భారీ సాయం ప్రకటించింది అమెరికా. భారత్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మద్దతుగా అదనంగా 25 మిలియన్​ డాలర్లు(రూ.186 కోట్లు) సాయం కింద అందిస్తున్నట్లు బుధవారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్ ట్విట్టర్​ ద్వారా తెలిపారు. భారత్ ​వ్యాప్తంగా వ్యాక్సిన్ సరఫరా గొలుసును బలోపేతం చేయటం ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అమెరికా సాయం ఉపకరిస్తుందని బ్లింకన్ తెలిపారు. కాగా,కరోనాను ఎదుర్కొనేందుకు గతేడాది జూన్​లో 41 మిలియన్​ డాలర్లను అమెరికా భారత్​ కు సాయంగా అందించిన విషయం తెలిసిందే. తాము ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న భారత్​కు అండగా నిలుస్తామని యూఎస్​ ఏజెన్సీ ఫర్​ ఇంటర్నేషనల్​ డెవలప్​మెంట్​ తెలిపింది.

ఇక,రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్లింకెన్​..కోవిడ్ తొలినాళ్లలో భారత్​ చేసిన సాయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు భారత్​కు తిరిగి సాయం చేయటం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు. భార‌త్-అమెరికా దేశాల బంధం బ‌ల‌మైన‌ద‌ని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. ప్ర‌పంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌, అమెరికా కీలక భూమిక పోషించగలవని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ముఖ్యంగా స్వేచ్ఛ, సమానత్వంపట్ల ఇరుదేశాలు తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలకు మించి వీటికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచనలతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు.

ఇక, బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా ఉన్నతాధికారులతో బ్లింకన్ సమావేశమయ్యారు. బ్లింకన్ తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ఓ ట్వీట్ లో..ఈ రోజు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ను కలవడం చాలా బాగుంది. భారత్-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అధ్యక్షుడు జో బైడెన్ యొక్క బలమైన నిబద్ధతను స్వాగతిస్తున్నట్లు మోదీ తెలిపారు.