Yadadri Break Darshans : యాదాద్రిలో కూడా తిరుమల మాదిరిగా బ్రేక్‌ దర్శనాలు, ఆన్‌లైన్‌ దర్శనాలు

కొండ కింద యాగశాల ప్రాంగణంలోని పార్కింగ్‌ స్థలంలో భక్తులు వాహనాలను నిలిపివేయాలన్నారు. దేవాలయం తరఫున నడిపే బస్సుల్లో కొండపైకి వచ్చి దర్శనం చేసుకోవాలని సూచించారు.

Yadadri Break Darshans : యాదాద్రిలో కూడా తిరుమల మాదిరిగా బ్రేక్‌ దర్శనాలు, ఆన్‌లైన్‌ దర్శనాలు

Yadadri (1)

Yadadri Break darshans : యాదాద్రిలో కూడా తిరుమల తరహాలో బ్రేక్‌ దర్శనాలు, ఆన్‌లైన్‌ దర్శనాలు కల్పించనున్నారు. ఈ మేరకు యాదాద్రి ఆలయ ఈవో గీత పేర్కొన్నారు. ఈ నెల 28న ఉదయం 11.55 గంటలకు సీఎం కేసీఆర్‌ యాదాద్రి ప్రధాన ఆలయాన్ని పునఃప్రారంభిస్తారని ఆమె చెప్పారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తులకు స్వయంభువుల దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. యాదాద్రి కొండపైకి భక్తుల వాహనాలకు అనుమతిలేదని ఈవో గీత స్పష్టం చేశారు.

కొండ కింద యాగశాల ప్రాంగణంలోని పార్కింగ్‌ స్థలంలో భక్తులు వాహనాలను నిలిపివేయాలన్నారు. దేవాలయం తరఫున నడిపే బస్సుల్లో కొండపైకి వచ్చి దర్శనం చేసుకోవాలని సూచించారు. ప్రతి భక్తుడికీ క్యూఆర్‌ కోడ్‌ను ఇస్తామని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవాలయ బస్సులను నడుపుతామని వెల్లడించారు. భక్తులు క్యూ కాంప్లెక్స్‌ నుంచే స్వామివారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Yadadri : యాదాద్రికి ప్రత్యేక పాలక మండలి

ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా యాదాద్రిలో చేపట్టిన ఏర్పాట్లపై ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. పార్కింగ్‌, నీటి వసతి, విద్యుత్తు సరఫరా, వీవీఐపీ విడిది నిమిత్తం కేటాయించిన గదుల వంటి అంశాలపై శుక్రవారం యాదాద్రి వీవీఐపీ అతిథి గృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా కొండపైకి ముఖ్యమంత్రి వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు.

ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, విల్లాల్లో మంత్రులు, మున్నూరు కాపు సత్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వసతి ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సమావేశానికి డీసీపీ నారాయణరెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, వైటీడీఏ ఎస్‌ఈ వసంతనాయక్‌, ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి, విద్యుత్తు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు హాజరయ్యారు.