కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణలో వేరే పార్టీకి పుట్టగతులుండవు

కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణలో వేరే పార్టీకి పుట్టగతులుండవు

gangula kamalakar on ys sharmila new party: దివంగత వైఎస్ఆర్ కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. లోటస్ పాండ్ లో మంగళవారం(ఫిబ్రవరి 9,2021) ఆమె ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేశారు.
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తొలి రోజు సమావేశంలోనే షర్మిల క్లారిటీ ఇచ్చేశారు. తన కొత్త పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పేరుని ప్రాథమికంగా ఖరారు చేసేశారు షర్మిల. అంతేకాదు పార్టీ పేరుని త్వరలో ఈసీకి దరఖాస్తు చేసే యోచనలో షర్మిల టీమ్ ఉంది. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కాగా, షర్మిల కొత్త పార్టీపై టీఆర్ఎస్ నేత, మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. కేసీఆర్ ఉన్నంతవరకు తెలంగాణలో వేరే పార్టీకి పుట్టగతులు ఉండవు అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధినేతకు, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం రాదు, రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ వేరే పార్టీలు వచ్చినా బతకవని తేల్చి చెప్పారు. కేసీఆర్ మీద ధిక్కార స్వరం వినిపించే ధైర్యం ఎవరికీ లేదని గంగుల కమలాకర్ అన్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం లేదని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. ‘మా పార్టీ ఉన్నన్ని రోజులూ వేరే పార్టీ మనుగడ సాగించ లేదు. మా పార్టీకి, మా నేత కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం లేదు, రాదు. ప్రజలందరూ కేసీఆర్‌ను కోరుకుంటున్నారు. ప్రస్తుతం సంతోషంగా ఉన్న ప్రజలు వేరే శక్తులొచ్చి ఫ్యాక్షనిజం చేస్తామంటే ఒప్పుకోరు’ అని గంగుల అన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు తేవాలని మంత్రి గంగుల డిమాండ్‌ చేశారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించట్లేదని ప్రశ్నించారు. కులాల ఆధారంగా జనాభా గణన జరగాలన్నారు. ఎంబీసీ అంటే బీజేపీ నేతలకు తెలుసా.?అని ఎద్దేవా చేశారు. ఎంబీసీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కొనియాడారు.

తెలంగాణలో రాజన్న లేని లోటు క్లియర్ గా కనిపిస్తోందని… ఆయన రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడమే తమ లక్ష్యమని వైఎస్ షర్మిల తెలిపారు. తెలంగాణలో ప్రతి ఇంటికి వెళ్తానని చెప్పారు. ఈరోజు నల్గొండ జిల్లా నేతలు, కార్యకర్తలతో సమావేశమై వారి సూచనలు, సలహాలను తీసుకోనున్నారు.

మరోవైపు కొత్త పార్టీపై కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేయబోతున్నారు. రానున్న 30 రోజులు పార్టీ నిర్మాణంపై దృష్టిని సారించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రకటన కోసం భారీ బహిరంగ సభను నిర్వహించే అవకాశం ఉంది. వైఎస్ఆర్, తెలంగాణ పేర్లు కలిసి వచ్చేలా పార్టీ పేరుని వైఎస్ఆర్ తెలంగాణ అని ప్రాథమికంగా ఖరారు చేసినట్లు సమాచారం. 100 నియోజకవర్గాల్లో 16 నెలల పాటు షర్మిల పాదయాత్ర చేపట్టే అవకాశం ఉంది.