Telangana Government : కరోనా వ్యాక్సినేషన్‌పై టీ.ప్రభుత్వం దృష్టి..సరిపడా డోసులు ఇవ్వాలని భారత్‌ బయోటెక్‌కు వినతి

కోవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో... తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందికి టీకా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే నిర్ణయించారు.

Telangana Government : కరోనా వ్యాక్సినేషన్‌పై టీ.ప్రభుత్వం దృష్టి..సరిపడా డోసులు ఇవ్వాలని భారత్‌ బయోటెక్‌కు వినతి

Telangana Government

Telangana government : కోవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో… తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందికి టీకా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే నిర్ణయించారు. సీఎం ఆదేశాలతో అధికారులు వ్యాక్సినేషన్‌ చర్యలు చేపడుతున్నారు. అందుకోసం భారత్‌ బయోటెక్‌ సీఎండీ క్రిష్ణా ఎల్లాతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ సమావేశమయ్యారు. వీరి భేటీ సుదీర్ఘంగా సాగింది.

రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ చేపట్టడానికి తెలంగాణకు అత్యధిక డోసులను సరఫరా చేయాలని భారత్‌ బయోటెక్‌ను సీఎస్‌ సోమేష్‌కుమార్‌ కోరారు. వ్యాక్సిన్‌ సరఫరాలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తెలంగాణకు అత్యధిక వ్యాక్సిన్‌లు ఇవ్వడానికి భారత్‌ బయోటెక్‌ సీఎండీ క్రృష్ణా ఎల్లా సానుకూలంగా స్పందించినట్టు సీఎస్‌ తెలిపారు.

తెలంగాణలో నాలుగున్నర కోట్ల మందిలో …. 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళు దాదాపు కోటి 80 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు 44 ఏళ్లు పైబడిన వాళ్ళల్లో 40 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇంకా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన వారు చాలా మంది ఉన్నారు. టీకా తీసుకోవాల్సిన వారిలో కూడా 18 ఏళ్లు పైబడిన వారికి… రెండు డోస్‌లు కలిపి దాదాపు నాలుగు లక్షల డోస్‌లు అవసరం ఉంటాయని చెబుతున్నాయి ప్రభుత్వ లెక్కలు. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎస్‌.. కృష్ణా ఎల్లా దృష్టికి తీసుకెళ్లారు.

తెలంగాణకు సరిపడ డోస్‌లతోపాటు.. ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయడానికి భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ సిద్ధం చేస్తోందని తెలిపారు కృష్ణ ఎల్లా. ప్రస్తుతం భారత్ బయోటెక్ సంస్థ ప్రతి నెల కోటి డోసులను ఉత్పత్తి చేస్తోందన్నారు. మే, జూన్ నెలల్లో ఉత్పత్తి చేసే డోసులకు కేంద్రం ఆర్డర్‌ ఇచ్చిందని సీఎస్‌ సోమేష్‌కుమార్‌ దృష్టికి తీసుకొచ్చారాయన.

ఇప్పటికే కోవాగ్జిన్ ధరలను ప్రకటించిన భారత్ బయోటెక్. రాష్ట్ర ప్రభుత్వాలకు డోసుకు 600 రూపాయల చొప్పున టీకా సరఫరా చేస్తాం అని వెల్లడించింది. ప్రైవేటు ఆస్పత్రులకు డోసుకు 1200 చొప్పున టీకా విక్రయిస్తామని తెలిపింది. అయితే భారత్‌ బయోటెక్‌ ప్రకటించిన ధరలను తగ్గించాలని ప్రభుత్వం కోరడంతో… దీనిపై భారత్‌ బయోటెక్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది.

మరోవైపు రాష్ట్రంలో ఉచిత వ్యాక్సిన్ పంపిణీ కోసం 2వేల 500 కోట్ల రూపాయలను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ను పెంచడంతోపాటు వేగవంతం గా వ్యాక్సినేషన్ చేయడం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.