Telangana Corona : టీకా తీసుకున్న వారికే హోటల్స్, మాల్స్‌లోకి ఎంట్రీ..?

తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, భారత్‌ సహా 135 దేశాల్లో డెల్టా వైరస్‌ తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. డెల్టా ఉధృతి కారణంగా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు.

Telangana Corona : టీకా తీసుకున్న వారికే హోటల్స్, మాల్స్‌లోకి ఎంట్రీ..?

Telangana Corona

Telangana Corona : తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, భారత్‌ సహా 135 దేశాల్లో డెల్టా వైరస్‌ తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. డెల్టా ఉధృతి కారణంగా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. మానవ శరీరంపై డెల్టా వైరస్‌ ప్రభావం ఎక్కువ కాలం ఉంటుందని తెలిపారు. ఇన్ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యాన్ని ఈ రకం వైరస్‌లో గుర్తించామన్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 2 డెల్టా ప్లస్‌ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఈ ఇద్దరూ కోలుకున్నారని, వారికి కాంటాక్ట్ లోకి వచ్చిన వారికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా నెగెటివ్ వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉన్నా, రెండో దశ ఇంకా పూర్తిగా తగ్గలేదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల్లో అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చినా కొందరు బయట తిరుగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులు బయట తిరగొద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా తెలంగాణలోని 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామంలో ఒక్కసారిగా కేసులు పెరిగాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో నిబంధనలు పాటించి కరోనా మూడో దశకు మారకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హెల్త్ డైరెక్టర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కరోనా టీకా తీసుకున్న వారినే హోటల్స్, మాల్స్ లోకి అనుమతించే అవకాశం ఉందన్నారు.

దేశంలో నమోదయ్యే కేసుల్లో 50శాతం కేరళలోనే నమోదవుతున్నాయన్నారు. వాక్సినేషన్ ఎక్కువగా జరిగిన దేశాల్లో కూడా కేసులు నమోదు అవుతున్నాయని, కానీ మైల్డ్‌గా ఉంటున్నాయన్నారు. డెల్టా, డెల్టా ప్లస్ రెండు దాదాపుగా ఒక్కటే లాగా ఉన్నాయన్నారు. ఏవీ ప్రమాదకరమైనవి కాదని, భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే నిర్లక్ష్యం తగదన్నారు. రాష్ట్రంలో స్వీయ నియంత్రణ లేకపోతే కేరళ లాగా పెరిగే ప్రమాదం ఉందన్నారు.

రాష్ట్రంలో 2.2 కోట్ల మంది వ్యాక్సినేషన్‌కు అర్హులు కాగా, ఇప్పటివరకు 1.12 కోట్ల మందికి ఓ డోసు వ్యాక్సిన్‌ ఇచ్చామన్నారు. 33.79 లక్షల మందికి రెండు డోసులు వేశామన్నారు. కేంద్రం నుంచి అదనంగా 9.5 లక్షల డోసులు వచ్చాయని తెలిపారు. ఒకట్రెండు వారాల్లో రెండో డోసుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తామన్నారు. కరోనా మూడో దశ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాని చెప్పారు. సరిపడ వైద్య సిబ్బంది, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పరిధిలో 26 వేల బెడ్స్ కి ఆక్సిజన్ సదుపాయాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 100కు పైగా బెడ్స్ ఉన్న ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి ఆగస్ట్ నెలాఖరుకు ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.