టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించిన స్పీకర్

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఎట్టకేలకు ఆమోదించారు.

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించిన స్పీకర్

speaker accepted tdp mla ganta srinivasa rao resignation

Updated On : January 23, 2024 / 6:26 PM IST

Ganta Srinivasa Rao Resignation: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాను ఎట్టకేలకు అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఈనెల 22న ఆమోదించినట్టు అసెంబ్లీ జనరల్ డాక్టర్ పీపీకే రామాచార్యులు మంగళవారం తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ 2021, ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా సమర్పించారు.

అయితే స్పీకర్‌ ఫార్మేట్‌లో రాజీనామా ఇవ్వలేదని అధికార వైసీపీ నాయకులు ఆరోపించడంతో ఆయన మరోసారి రిజైన్ లెటర్ ఇచ్చారు. 2021, ఫిబ్రవరి 12న విశాఖపట్నంలోని కూర్మనపాలెం గేట్‌ దగ్గర కార్మిక సంఘాల రిలే నిరాహారదీక్ష సందర్భంగా మీడియా సమక్షంలో రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్‌కు అందజేయాల్సిందిగా జర్నలిస్టులను కోరారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌కు విన్నవించారు. తర్వాతి రోజు విశాఖ జర్నలిస్ట్స్ ఫోరం (వీజేఎఫ్) ప్రతినిధులు ఆ లేఖను శాసనసభ కార్యదర్శికి అందజేశారు.

Also Read: ఐదో లిస్టుపై సీఎం జగన్ కసరత్తు.. పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, నేతలకు తాడేపల్లి నుంచి పిలుపు

కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే విశాఖ జిల్లాకు తలమానికంగా నిలిచిన వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించారని గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రూమర్లు వచ్చాయి. తాజాగా రాజ్యసభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: ఆ హామీ ఇస్తేనే.. వైసీపీ హైకమాండ్ ముందు కొత్త ప్రతిపాదన పెట్టిన మంత్రి

టీడీపీ అలర్ట్.. వైసీపీ వ్యూహానికి కౌంటర్‌
గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో టీడీపీ అలర్టయింది. వచ్చే రాజ్యసభ ఎన్నికల నాటికి తమ సంఖ్యా బలం తగ్గించేలా చేయాలన్న వైసీపీ వ్యూహంలో భాగంగానే గంటా రాజీనామాను ఆమోదించారని టీడీపీ అంటోంది. వైసీపీ వ్యూహానికి కౌంటర్‌గా.. తమ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్‌పై ఒత్తిడి తేవాలని టీడీపీ భావిస్తోంది. కరణం బలరాం, వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్ ను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.