CM Jagan Pulivendula Tour : పులివెందులో సీఎం జగన్ సుడిగాలి పర్యటన.. రూ.861 కోట్లతో చేపట్టిన నిర్మాణాల ప్రారంభం

500 కోట్లతో నిర్మించిన.. డా.వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ భవనాలను సీఎం జగన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

CM Jagan Pulivendula Tour : పులివెందులో సీఎం జగన్ సుడిగాలి పర్యటన.. రూ.861 కోట్లతో చేపట్టిన నిర్మాణాల ప్రారంభం

CM Jagan Pulivendula Tour

Updated On : March 11, 2024 / 11:04 PM IST

CM Jagan Pulivendula Tour : సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు సీఎం వైఎస్ జగన్. నియోజవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన.. 861 కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణాలను ఘనంగా ప్రారంభించారు. పులివెందుల అభివృద్ధి అనంతం అని, ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందన్నారు సీఎం జగన్.

పులివెందుల.. రాష్ట్రానికే ఆదర్శం..!
ఎన్నికల నోటీఫికేషన్ రానుండటంటో.. సొంత నియోజకవర్గం పులివెందులలో సుడిగాలి పర్యటన చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. 861 కోట్లతో చేపట్టిన నిర్మాణాలను ప్రారంభించారు. అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శనీయమన్నారు సీఎం జగన్‌. ఒక్క రోజు వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన సీఎం జగన్‌.. పులివెందుల పట్టణ, నియోజకవర్గ రూపురేఖలు మార్చే అభివృద్ధి పనులను అందుబాటులోకి తెచ్చారు.

మీ అభిమానం, ఆశీస్సులు, దీవెనలే కారణం..
సొంత గడ్డపై ముఖ్యమంత్రిగా నిలుచున్నానంటే.. పులివెందుల ప్రజల అభిమానం, ఆశీస్సులు, దీవెనలేనన్నారు జగన్. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి.. పులివెందులలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి అనేది అనంతమన్న జగన్.. కాలానుగుణంగా అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుందన్నారు. సొంతగడ్డపై మమకారం ఎప్పటికీ తీరిపోయేది కాదన్నారు జగన్.

రూ.861 కోట్లతో చేపట్టిన నిర్మాణాలు ప్రారంభం..
500 కోట్లతో నిర్మించిన.. డా.వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ భవనాలను సీఎం జగన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పులివెందుల మైన్స్ దగ్గర 20కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ బనానా ప్యాక్ హౌస్ భవనాన్ని ఓపెన్ చేశారు. పులివెందుల పట్టణంలో 2.79 ఎకరాల్లో 38.15 కోట్లతో నిర్మించిన డా.వైఎస్ఆర్ మినీ సెక్రటేరియేట్ కాంప్లెక్స్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. పులివెందులలో 70 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన వైఎస్ఆర్ జంక్షన్ ను సీఎం ప్రారంభించారు. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ లో భాగంగా 11.04 కోట్లతో అభివృద్ధి చేసిన సెంట్రల్ బౌలే వార్డుకు ప్రారంభోత్సవం చేశారు. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా.. 20.69 కోట్లతో అధునాతన వసతులతో నిర్మించిన వైఎస్ జయమ్మ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భవన సముదాయాన్ని సీఎం జగన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఒక్కరోజులోనే పదులకొద్దీ నిర్మాణాల ప్రారంభోత్సవం..
పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా.. నిర్మించిన గాంధీ జంక్షన్ ను ప్రారంభించారు సీఎం. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా.. 65కోట్ల నిధులతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన డా. వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ ను అందుబాటులోకి తెచ్చారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా.. ప్రైవేట్ పార్ట్ నర్ ఆధ్వర్యంలో.. రూ.175 కోట్ల పెట్టుబడితో 16.63 ఎకరాల్లో నిర్మించిన ఆదిత్య బిర్లా యూనిట్‌ను జగన్ ప్రారంభించారు. ఇడుపులపాయ ఎస్టేట్ లో నిర్మించిన డా. వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఒక్కరోజు పర్యటనలో పదులకొద్దీ నిర్మాణాల ప్రారంభోత్సవం చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.

Also Read : బీజేపీ కోసం పవన్ కల్యాణ్ మరో త్యాగం.. ఎన్ని సీట్లు వదులుకున్నారంటే.. బీజేపీకి దక్కిన స్థానాలు ఎన్నంటే