Skill Development Colleges : 75శాతం ఉద్యోగాలు స్థానికులకే, ఏపీలో కొత్తగా 30 స్కిల్ కాలేజీలు
యువతకు స్థానికంగా ఉండే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Skill Development Colleges
Skill Development Colleges : యువతకు స్థానికంగా ఉండే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందుకు అనుగుణంగా పరిశ్రమల్లో పని చేయడానికి నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకుగాను రాష్ట్రంలో ఒక నైపుణ్య విశ్వవిద్యాలయంతో పాటు, పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీ చొప్పున 25 స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీలు, 4 ట్రిపుల్ ఐటీలు, పులివెందుల జేఎన్టీయూలో కలిపి మొత్తం 30 స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీలకు త్వరలోనే శంకుస్థాపన చేయనుంది.
ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొత్తం పూర్తయింది. స్కిల్ కాలేజీలో ఎలాంటి కోర్సులు ఉండాలన్న దానిపై పరిశ్రమల శాఖ, నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ‘సమగ్ర పరిశ్రమ సర్వే’ చేస్తుంది. సర్వే నివేదిక అధారంగా కోర్సులను అందించనున్నారు. యువత ఆశయాలను గుర్తించి పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం అందించేందుకు, తద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగు ముందుకు వేస్తుందని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.