రంగంలోకి దిగిన ఈవో, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు..! టీటీడీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు..

మొత్తంగా టీటీడీ ప్రక్షాళన మొదలవడంతో తిరుమలకు మళ్లీ మంచిరోజులొస్తాయని భక్తులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. తిరుమల పవిత్రతను తగ్గించేందుకు ప్రయత్నించిన వారిపైనా, అన్యమత ప్రచారం చేసినవారిపైనా, అందుకు సహకరించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రంగంలోకి దిగిన ఈవో, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు..! టీటీడీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు..

Operation Tirumala : టీటీడీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడుతున్నాయి. అన్ని విభాగాల ప్రస్తుత పరిస్థితిని ఈవో ఆరా తీశారు. వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈవో తనిఖీలతో టీటీడీ అధికారులు బెంబేలెత్తుతున్నారు. భక్తులకు సౌకర్యాలు, దుకాణాల నిర్వహణ సహా అన్ని విషయాలనూ సమగ్రంగా పరిశీలిస్తున్నారు. శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన విరాళాలు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు అనేదాని పైన కూడా ఈవో ఆరా తీస్తున్నట్టు సమాచారం

అక్రమార్కుల గుండెల్లో రైళ్లు..
టీటీడీ అధికారులు, ఉద్యోగులు మూడు రోజులుగా ఉరుకులు పరుగులు తీస్తున్నారు. క్యూలైన్లలో ఏర్పాట్లు మొదలుకుని అన్నప్రసాదం దాకా అన్నీ సరిగా ఉన్నాయా లేదా అని పలుమార్లు సరి చూసుకుంటున్నారు. టీటీడీతోనే ప్రక్షాళన ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పడం, కొత్త ఈవో వరుస తనిఖీలతో అక్రమార్కుల సంగతి తేల్చేందుకు సిద్ధమవడంతో టీటీడీ ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు.

నిధుల దుర్వినియోగం జరిగినట్టు తేలితే చర్యలు..
టీటీడీలో ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసిన తర్వాతే ప్రక్షాళన మొదలవుతుందని చెప్పిన ఈవో శ్యామలరావు చెప్పినట్టుగానే అన్ని విభాగాల ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. టీటీడీలో ఏ పని చేసినా పారదర్శకత పాటిస్తామని బాధ్యతలు స్వీకరించిన సమయంలో చెప్పిన ఈవో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. టీటీడీ నిధులు సక్రమంగా వినియోగించుకుంటామని తెలిపారు. గతంలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

దర్శనంపై భక్తుల నుంచి ఫిర్యాదులు..
గత పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల సర్వదర్శనం క్యూలైన్లు పరిశీలించిన ఈవో అక్కడి సమస్యలపై ఓ అవగాహనకొచ్చారు. నడకదారి భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు ఇవ్వడం లేదని భక్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని ఈవో తెలిపారు. క్యూలైన్లు పరిశీలించిన అనంతరం అన్నప్రసాదంలో ప్రసాదం స్వీకరించారు.

అన్నప్రసాదంలో నాణ్యత లేదని ఆరోపణలు..
తిరుమల అన్న ప్రసాదంలోనూ శ్యామలరావు తనిఖీలు జరిపారు. ఎంతో దూరం నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వచ్చే భక్తులు అన్నప్రసాదంతో ఆకలి తీర్చుకుంటారు. అన్నప్రసాదం వంటకం, వడ్డింపు, గదుల నిర్వహణపై ఐదేళ్ల ముందువరకూ ఎన్నో ప్రశంసలు వినిపించేవి. కొన్నాళ్లుగా అన్నప్రసాదంలో నాణ్యత ఉండడం లేదని, అలాగే భోజనం చేసే గదుల దగ్గర శుభ్రత పాటించడం లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈవో శ్యామలరావు అన్నప్రసాదం పరిశీలించి…ఆ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు.

దుకాణదారులకు ఈవో వార్నింగ్..
ఈవో పరిశీలనలో అనేక విషయాలు బయటపడుతున్నాయి. శ్రీవారి మెట్టు నడక మార్గంలో దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని భక్తులు ఫిర్యాదు చేశారు. దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. అలాగే తనిఖీల అనంతరం విభాగ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇంజనీరింగ్ పనులపై కూడా పలు ఆరోపణలు వచ్చాయి.

తిరుమలకు మళ్లీ మంచిరోజులు..!
ఇంజనీరింగ్ పనులకు 15శాతం వరకు కమిషన్లు తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. ఇంజినీరింగ్ పనులపై ఈవో ఆరా తీస్తున్నట్టు సమాచారం. అలాగే శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన విరాళాలు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు అనేదాని పైన కూడా ఈవో వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈవో తనిఖీలు, వరుస సమావేశాలతో అక్రమాలకు పాల్పడిన అధికారుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మొత్తంగా టీటీడీ ప్రక్షాళన మొదలవడంతో తిరుమలకు మళ్లీ మంచిరోజులొస్తాయని భక్తులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. తిరుమల పవిత్రతను తగ్గించేందుకు ప్రయత్నించిన వారిపైనా, అన్యమత ప్రచారం చేసినవారిపైనా, అందుకు సహకరించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read : అన్నది చేసి చూపిస్తున్న సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ తిరుమల షురూ..!