Thalliki Vandanam: విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.15వేలు.. తల్లికి వందనం డబ్బులు పడేది ఎప్పుడో చెప్పేసిన సీఎం చంద్రబాబు..
తల్లికి వందనం స్కీమ్ ద్వారా ప్రతీ విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు.

Thalliki Vandanam: తల్లికి వందనం పథకం అమలుపై కడప మహానాడులో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. బడులు తెరిచే లోపే ఈ స్కీమ్ ను అమలు చేస్తామన్నారాయన. ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం చెల్లిస్తామని మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు.
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక సీమ్స్ లో తల్లికి వందనం ఒకటి. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తామంది. ఈ పథకాన్ని పాఠశాలల ప్రారంభానికి ముందే అమలు చేయాలని కూటమి సర్కార్ భావిస్తోంది.
జూన్ లో స్కూల్స్ తెరుచుకుంటాయి. ఆ లోపే అనగా జూన్ 12న ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు తల్లికి వందనం పథకం డబ్బులు ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఊరట లభించినట్లయింది. సీఎం చంద్రబాబే స్వయంగా జూన్ లో పథకాన్ని అమలు చేస్తామని చెప్పడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తల్లికి వందనం స్కీమ్ ద్వారా ప్రతీ విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. దీంతో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ.. అంటే ఇంటర్ వరకూ చదివే పిల్లలందరికీ రూ.15వేలు చొప్పున వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది.
Also Read: టీడీపీలో ఉన్న వైసీపీ కోవర్టులు ఎవరు? ఖబర్దార్ అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చింది ఎవరికి..
తల్లికి వందనం పథకం అమలు కోసం 2025-26 బడ్జెట్‌లో ప్రభుత్వం.. రూ.9407 కోట్లు కేటాయింపులు చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. ఇందులో సుమారు 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ తేల్చింది. తల్లికి వందనం పథకానికి అర్హులు కావాలంటే.. విద్యార్థులు కచ్చితంగా 75 శాతం అటెండెన్స్ నిబంధన పాటించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. వారికే దీన్ని వర్తింపజేయనున్నారని సమాచారం.
గత వైసీపీ సర్కార్ అమ్మఒడి పేరుతో ఈ స్కీమ్ ను అమలు చేసింది. ఇంట్లో చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉన్నా.. ఒకరు మాత్రమే ఈ పథకానికి అర్హులు. తాము అధికారంలోకి వచ్చాక ఇంట్లో చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉన్నా వారందరికీ తల్లికి వందనం కింద రూ.15వేలు సాయం చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. విద్యా వ్యవస్థను మెరుగుపరిచేలా, ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థి చదువు ఆపేయకుండా ఈ స్కీమ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.