రాజధాని అమరావతిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలు పెట్టిన సైట్లను చంద్రబాబు పరిశీలించబోతున్నారు.

Cm Chandrababu Naidu : రేపు (జూన్ 20) రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. తన రెండో పర్యటనలో భాగంగా రాజధానిలో సీఎం చంద్రబాబు టూర్ చేయనున్నారు. ఉండవల్లిలో నాటి ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి చంద్రబాబు రాజధాని పర్యటన ప్రారంభం కానుంది.
ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజధాని నిర్మాణాలను సీఎం చంద్రబాబు పరిశీలించబోతున్నారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు సందర్శిస్తారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలు పెట్టిన సైట్లను చంద్రబాబు పరిశీలించబోతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తన రెండో అధికారిక పర్యటనకు రాజధాని ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండు ప్రాధాన్యత అంశాలను ప్రధానంగా తీసుకున్నారు. ఒకటి పోలవరం, రెండోది అమరావతి. అందులో భాగంగానే మొదటగా పోలవరం పర్యటన పూర్తి చేశారు. రెండోవదిగా రాజధాని ప్రాంతాన్ని సందర్శించబోతున్నారు.
గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి పురోగతి లేకుండా పోయింది. మూడు రాజధానుల పేరుతో రాజధాని అభివృద్ధి అన్నది లేకుండా పోయిందని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో ఏం జరిగింది? అనేది తెలుసుకోవడానికి సీఎం చంద్రబాబు క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లి చూడబోతున్నారు.
రాజధానికి ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో ఆ ప్రాంతానికి (ఉద్దండరాయునిపాలెం) కూడా చంద్రబాబు వెళ్లబోతున్నారు. అక్కడి నుంచి చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీడ్ యాక్సెస్ రోడ్ లోని ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను సైతం పరిశీలించబోతున్నారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గతంలో తాను చేసిన శంకుస్థాపనలను కూడా చంద్రబాబు సందర్శించబోతున్నారు. 70-80 నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలను సైతం గత ప్రభుత్వం వదిలేసిందని విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు.
కొత్త టెండర్లకు 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది- మంత్రి నారాయణ
”రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక వద్ద నుంచి పర్యటన ప్రారంభమవుతుంది. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ముందుగా సందర్శిస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, జడ్జిలు, అధికారుల క్వార్టర్లను పరిశీలిస్తారు.
చివరగా సీఆర్డీయే ప్రాజెక్ట్ ఆఫీసును సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు. అక్కడే మీడియాతో చంద్రబాబు మాట్లాడతారు. ముందుగా కమిటీలు వేసి రాజధానిలో జరిగిన డ్యామేజ్ ను పరిశీలిస్తాం.
టెండర్లకు పెట్టిన కాలపరిమితి ముగిసింది కాబట్టి కొత్తగా టెండర్లు పిలవాలి. కొత్తగా అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవాలి. టెండర్లకు కనీసం 3 నుంచి 4 నెలలు టైం పడుతుంది. క్యాబినెట్ లో చర్చించిన తర్వాత పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలని దానిపై నిర్ణయం తీసుకుంటాం. రాజధానిలో సామాగ్రి దొంగలించిన వారిపై చర్యలు తీసుకుంటాం. రాజధానిలో ఇళ్ల స్థలాల విషయం సుప్రీంకోర్టులో ఉంది. న్యాయసలహా తీసుకుని ముందుకు వెళ్తాం” అని మంత్రి నారాయణ తెలిపారు.
Also Read : అన్నది చేసి చూపిస్తున్న సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ తిరుమల షురూ..!