CM Jagan – Chandra babu : ఒకే నియోజకవర్గంలో జగన్, చంద్రబాబు పర్యటన.. రాత్రికి రాజమండ్రిలో నేతల బస.. పోలీసులు పటిష్ట బందోబస్తు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సోమవారం ఒకే నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

CM Jagan and Chandra babu
CM Jagan Mohan Reddy : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy), మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సోమవారం ఒకే నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పోలవరం నియోజకవర్గం (Polavaram Constituency) పరిధిలో ఉన్న కూనవరం మండలం (Koonavaram Mandal) లో సీఎం జగన్ వరద బాధితులను పరామర్శించనున్నారు. అలాగే చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబు వెళ్లనున్నారు. మరోవైపు రాత్రి సమయంలో ఇద్దరు నేతలు రాజమండ్రిలో బస చేయనుండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఎం జగన్ పర్యటన ఇలా..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులు పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి బాధితులను పరామర్శిస్తారు. సోమవారం అల్లూరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది. ఉదయం 10:25 నిమిషాలకు తాడేపల్లి నుండి కూనవరం మండలం కోతుల గుట్టకు హెలికాప్టర్లో సీఎం జగన్ చేరుకుంటారు. వరద బాధితులను కలుసుకుంటారు. 10.55 గంటలకు కోతులు గుట్ట నుండి రోడ్డు మార్గంలో కూనవరం చేరుకుంటారు. 12.40 వరకు కూనవరం బస్టాండ్‌లో కూనవరం, వి.ఆర్.పురం మండలాల వరద బాధితులతో సీఎం జగన్ సమావేశం అవుతారు. మధ్యాహ్నం 1.00 గంటలకు రోడ్డు మార్గంలో కోతులకొట్టుకు చేరుకుంటారు. 2.20 గంటలకు హెలికాప్టర్‌లో కుక్కునూరు మండలం గొమ్ముగూడెం గ్రామానికి సీఎం జగన్ చేరుకుంటారు. గొమ్ముగూడెం గ్రామంలో నడుచుకుంటూ వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.
మధ్యాహ్నం 3.25 గంటల వరకు వరద బాధితులతో సమావేశం అవుతారు. 3.40 గంటలకు గొమ్ముగూడెం గ్రామం నుండి హెలికాప్టర్‌లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సీఎం జగన్ బయలుదేరుతారు. 4.10 గంటలకు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 4.20 కి రోడ్డు మార్గంలో హెలీప్యాడ్ నుండి రాజమండ్రి ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో వైసీపీ నేతలతో సమావేశం అవుతారు. సోమవారం రాత్రికి ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లోనే సీఎం జగన్ బస చేస్తారు. మరుసటి రోజు (మంగళవారం) కోనసీమ ప్రాంతంలో లంక గ్రామాలను సీఎం జగన్ పర్యటిస్తారు.
చంద్రబాబు పర్యటన..
మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా సోమవారం ఉదయం 10గంటలకు చింతలపుడి వెళ్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పోలవరం మండలం పట్టిసీమకు చేరుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం ఎత్తిపోతలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి పోలవరం వెళ్లి ప్రాజెక్టు పనుల తీరును పరిశీలిస్తారు. సాయంత్రం 6గంటలకు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మీదుగా దేవరపల్లి చేరుకొని రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొని చంద్రబాబు ప్రసంగిస్తారు. రాత్రికి రాజమహేంద్రవరంలో బస చేస్తారు. మంగళవారం ఉధయం పోలవరం ప్రాజెక్టుకు సమీపంలోని సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతలను పరిశీలిస్తారు. అక్కడ నుంచి తిరుగుపయనంలో కోరుకొండ వద్ద బహిరంగసభలో పాల్గొంటారు. మంగళవారం రాత్రికి విశాఖపట్టణంకు చంద్రబాబు బయలుదేరి వెళ్తారు.
Chandrababu : పులివెందుల గడ్డపై పులి కేకలు వేశా..నువ్వెంత?
అయితే, ఇద్దరు నేతలు ఒకే ప్రాంతంలో బస చేయనున్నారు. చంద్రబాబు బీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో, ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సీఎం జగన్ బస చేస్తారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు చేశారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఎలాంటి వివాదాలు చోటుచేసుకోకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు.