నమ్మించి మోసం : కమాండర్‌ ఇంటికే కన్నం వేసిన కానిస్టేబుల్‌

నమ్మించి మోసం : కమాండర్‌ ఇంటికే కన్నం వేసిన కానిస్టేబుల్‌

Updated On : January 13, 2021 / 10:38 AM IST

Constable who stole jewelry in the Commander‌’s house : తిన్నింటి వాసాలు లెక్కించడం అంటే ఇదేనేమో. నమ్మిన వారింటికే కన్నం వేశాడో కానిస్టేబుల్‌. తన పైఅధికారి కుటుంబ సభ్యుల నగలను చోరీ చేశాడు. పైగా విచారణకు వెళ్లిన పోలీసులను తప్పుదోవ పట్టించాడు. ఆయన ఆటలను కట్టడి చేస్తూ 2గంటల్లోనే మంగళగిరి రూరల్‌ పోలీసులు కేసును ఛేదించారు. మంగళవారం గుంటూరులో అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.

నాగార్జున యూనివర్సిటీలోని 10వ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్‌కు సంతోష్‌కుమార్‌ కమాండెంట్‌గా విధులు నిర్వర్తిహిస్తున్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కునుకు శ్రీనివాసరావు ఎన్‌డీఆర్‌ఎఫ్‌లోని కమాండెంట్‌ కార్యాలయం వద్ద డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. ఏడేళ్లుగా కుటుంబసభ్యుడిగా మెలిగిన శ్రీనివాసరావుపై నమ్మకంతో కమాండెంట్‌ సంతోష్‌ తన ఇంటి తాళాల్లో ఒకటి అతనికిచ్చారు.

ఇటీవల కమాండెంట్‌ జమ్మూకశ్మీర్‌కు, కానిస్టేబుల్‌ శ్రీకాకుళానికి బదిలీ అయ్యారు. శ్రీకాకుళం వెళ్లి రిపోర్టు చేయాలని శ్రీనివాసరావును సంతోష్‌కుమార్‌ ఆదేశించారు. ‘అయ్యా.. మీరు కశ్మీర్‌ వెళ్లే వరకు మీతోనే ఉంటా’ అంటూ సెంటిమెంట్‌గా మాట్లాడటంతో సరేనన్నారు. రెండు రోజుల క్రితం కమాండెంట్‌ తన ఇంటి సామాను జమ్ముకశ్మీర్ కు పంపించారు. బంగారు ఆభరణాలన్నీ ఒక సంచిలో పెట్టి ఇంట్లోనే ఉంచుకున్నారు. 11న సంతోష్‌ కుటుంబ సభ్యులతో కలిసి సహచర అధికారి కుమారుడి పుట్టిన రోజు వేడుకకు వెళ్లాడు. వారితోపాటు వచ్చిన శ్రీనివాసరావు మధ్యలోనే వెళ్లిపోయాడు.

వేడుక ముగిశాక కమాండెంట్‌.. ఇంటికి వచ్చి చూస్తే నగల సంచీ కనిపించలేదు. ఎస్పీకి ఫోన్‌ చేయగా ఆయన డీఎస్పీ దుర్గాప్రసాద్‌, సీఐ శేషగిరిరావు, క్లూస్‌టీం నిపుణులను అప్రమత్తం చేశారు. పోలీసులు ఘటనాస్థలిలో పరిశీలించి శ్రీనివాసరావును ప్రశ్నించగా వారిని తప్పుదోవ పట్టించేందుకు యత్నించాడు. నగల సంచితోపాటు ఇతర సంచులు తెరిచి ఉన్నాయని, కిటికీ గ్రిల్స్‌ను వంచేశారని, అక్కడక్కడా సిగరెట్‌ ముక్కలున్నట్లు చూపించి దొంగలపనిగా నమ్మించాలని చూశాడు.

అయితే ఇంటి తాళం ఒకటి శ్రీనివాసరావు వద్ద ఉన్నట్లు తెలుసుకొని విచారిస్తే ‘నాపైనే అనుమానపడుతున్నారా… కావాలంటే నా ఫోన్‌ లొకేషన్‌ టవర్‌ నుంచి పరిశీలించుకోండి’ అంటూ బుకాయించాడు. అనుమానంతో పోలీసులు గట్టిగా విచారిస్తే తానే దొంగతనం చేశానని ఒప్పుకున్నాడని ఎస్పీ తెలిపారు. తనకున్న రూ.10 లక్షల అప్పులు తీర్చడంతోపాటు భార్యాపిల్లలకు బంగారు ఆభరణాలు చేయించాలని అనుకుంటున్నానని తెలిపాడన్నారు.