ఏపీలో కరోనా ఫీవర్ : గుంటూరు గజగజ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఒక్కరోజే మరో 44 మందికి కరోనా పాజిటివ్ రాగా… మొత్తం కేసులు 483కు పెరిగాయి. వీటిల్లో ఎక్కువగా… ఢిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 16 మంది డిశ్చార్జ్ అవగా… 9మంది మరణించారు.
కృష్ణాలో ముగ్గురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 458గా ఉంది. 6 జిల్లాల్లోనే 380 కరోనా కేసులు నమోదు కాగా, మిగిలిన ఏడు జిల్లాల్లో కలిపి 105 కేసులు నమోదయ్యాయి.
ఏపీలోని ఐదు జిల్లాల్లోనే 347 కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పోటాపోటీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లోనే 205 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో మంగళవారం ఒక్కరోజు 21 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో గుంటూరు జిల్లాలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కేసులు 114కు చేరుకున్నాయి. కర్నూలు జిల్లా 91 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. నెల్లూరులో 56, ప్రకాశంలో 42, కృష్ణాలో 44, కడపలో 33 కరోనా కేసుల చొప్పున నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో 2010 శాంపిల్స్‌ను పరీక్షించగా 41 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌తో 9 మంది మృతి చెందగా…కరోనా బారిన పడి చికిత్స పొందుతూ కోలుకుని 16 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇటు కర్నూలు జిల్లాను కూడా కరోనా ఫియర్ వెంటాడుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం కొత్తగా 7 కేసులు నమోదవ్వడంతో జిల్లా వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 91కి చేరింది. కాగా పాజిటివ్ వచ్చిన కేసుల్లో ఢిల్లీ జమాత్ ప్రార్ధనలకు వెళ్లొచ్చిన వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు రోడ్‌జోన్లలో ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేశారు.
ఏపీ కరోనా పాజిటివ్ నిర్ధారించిన బాధితుల నివాస స్థలాలను ప్రభుత్వం ప్రకటించింది. బాధితులందరినీ ఐసొలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. కరోనా బాధితులతో కాంటాక్ట్ అయిన వారందరినీ క్వారంటైన్‌కు తరలించినట్లు వెల్లడించింది. బాధితుల వివరాలు తెలుసుకుని, ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసే ప్రక్రియలో భాగంగానే బాధితుల వివరాలను ప్రభుత్వం ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన వివరాల్లో బాధితుడి పేరు పేర్కొనకుండా కరోనా సోకిన వ్యక్తి జిల్లా, నివాస ప్రాంతం, వయసు, జెండర్, కరోనా ఎలా సోకింది, ఎప్పుడు సోకింది అనే వివరాలు పొందుపరిచింది.