తిట్టబోతే అక్క కూతురు.. కొట్టబోతే కడుపుతో ఉందన్నట్టుగా..: సీపీఐ నారాయణ
వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్‌లోకి తీసుకుని జగన్‌ని భయపెట్టారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు పోయినట్లే, ఏపీలో జగన్ సర్కారు పోవాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.

CPI National Secretary Narayana
CPI Narayana: తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పార్టీ పరిస్థితి తిట్టబోతే అక్క కూతురు.. కొట్టబోతే కడుపుతో ఉంది అన్నట్టు ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
కొత్తగూడెం ఎమ్మెల్యేగా సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు గెలిచారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీపీఐ ఏమీ అనలేని పరిస్థితి. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కోసం ఇవాళ సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై నారాయణ మండిపడ్డారు.
రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయన్నారు. ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి బలపడుతుందని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పిదాల వల్లే బీజేపీ మూడు రాష్ట్రాల్లో గెలిచిందని అన్నారు. ఎన్నికల వేళ అయోధ్యలో రామమందిర నిర్మాణంపై హడావిడి చేస్తున్నారని ఆరోపించారు.
జనవరి 22న అయోధ్య రామాలయాన్ని ప్రారంభించి ఓట్లు దండుకోవాలని భావిస్తోందని అన్నారు. పార్లమెంట్‌పై దాడి జరిగితే బీజేపీ జవాబు చెప్పలేకపోతోందని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ డ్రామా చేసిందని మండిపడ్డారు. అదానీని కాపాడే పనిలో బీజేపీ ఉందన్నారు. ఇండియా కూటమిని బలపరిచేలా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్‌లోకి తీసుకుని జగన్‌ని భయపెట్టారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు పోయినట్లే, ఏపీలో జగన్ సర్కారు పోవాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.
Also Read: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు..