కర్నూలు జిల్లాలో విరివిగా లభిస్తున్న వజ్రాలు

  • Published By: vamsi ,Published On : August 17, 2020 / 12:37 PM IST
కర్నూలు జిల్లాలో విరివిగా లభిస్తున్న వజ్రాలు

Updated On : August 17, 2020 / 1:41 PM IST

కర్నూలు జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో పోలాల వెంబడి వజ్రాలు విరివిగా లభిస్తున్నాయి. ముఖ్యంగా తుగ్గలి మండలంలోని పలు గ్రామాలకు ప్రజలు, ఔత్సాహికులు క్యూ కడుతున్నారు. రోజంతా వజ్రాల కోసం వెతుకుతున్నారు. అదృష్టం బాగున్నవారికి వజ్రాలు కనిపిస్తున్నాయి.



ప్రతి సంవత్సరం తొలకరి వర్షాలు కురవగానే విలువైన డైమండ్స్ నేలపైకి వస్తుండగా.. పొలాల్లో రైతులు, కూలీలతో పాటు, చుట్టు పక్కల ప్రాంతాల వారు కర్ణాటక నుంచి కూడా వచ్చి వజ్రాల అన్వేషణలో బిజీగా గడుపుతున్నారు.



ఈ సంవత్సరం ఇప్పటికే 50కి పైగా వజ్రాలు లభించినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా జొన్నగిరి, పెరవలి తదితర ప్రాంతాల్లోని వజ్రాల వ్యాపారులతో పాటు, గుత్తికి చెందిన వారు రహస్యంగా వీటిని కొంటున్నారు. ఇప్పటివరకూ విక్రయించబడిన వజ్రాల విలువ రూ. 50 లక్షల వరకూ ఉన్నట్లుగా చెబుతున్నారు.



వజ్రం లభించిన వారికి, వ్యాపారులు ఆఫర్ చేసిన ధర నచ్చకుంటే, వ్యాపారులంతా టెండర్లు వేస్తారు. ఎక్కువ ఆఫర్ చేసిన వారికి వజ్రం సొంతం అవుతుంది. ఈ ప్రక్రియ ఆసాంతం రహస్యమే. రెండురోజుల క్రితం జొన్నగిరి ప్రాంతంలో ఓ మహిళా కూలీకి విలువైన వజ్రం లభించగా, దానిని ఓ వ్యాపారి రూ.6 లక్షల క్యాష్, 5 తులాల బంగారం ఇచ్చి కొన్నట్టు చెబుతున్నారు.