హాస్టళ్ల నుంచి ఎవరినీ ఖాళీ చేయించొద్దు : తెలంగాణ డీజీపీ

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థులను ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపొద్దని అధికారులను ఆయన ఆదేశించారు.
లాక్‌డౌన్ ఉన్నందున ఎవరూ ఇళ్లు విడిచి వెళ్లొద్దని సూచించారు. స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలేవీ చెల్లవని డీజీపీ స్పష్టం చేశారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హాస్టళ్ల నిర్వాహకులతో మాట్లాడాలని మహేందర్‌రెడ్డి ఆదేశించారు.
కేటీఆర్‌తో మాట్లాడిన మంత్రి బొత్స :
మరోవైపు హైదరాబాద్‌లో హాస్టళ్లు, మెస్‌ల మూసివేశారు. ఏపీ విద్యార్థుల అగచాట్ల అంశాన్ని ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఏపీ మంత్రి బొత్స సత్యన్నారాయణ మాట్లాడారు. హాస్టళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారని, వారికి రవాణా ఇబ్బందులు ఉన్నాయని మంత్రి బొత్స చెప్పారు. ఈ సమయంలో ఒక చోట నుంచి ఇంకో చోటకు కదలడం కూడా శ్రేయస్కరం కాదని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇదే అంశాలను ఏపీ సీఎస్ తెలంగాణ సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ సీఎస్ సోమేష్‌కుమార్‌తో ఏపీ సీఎస్ నీలం సాహ్ని మాట్లాడిన అనంతరం తెలంగాణ సీఎంఓ అధికారులతో ఏపీ సీఎంఓ అధికారులు మాట్లాడారు. ప్రత్యేకంగా పోలీసులు పాసులు ఇస్తున్న ఘటనలు కూడా తమ దృష్టికి వచ్చిందనీ ఏపీ సీఎస్ తెలిపారు.
ఈ సంప్రదింపుల తర్వాత హాస్టళ్లను, పీజీ మెస్‌లను మూసేయవద్దని తెలంగాణ మంత్రి కేటీఆర్ విస్పష్ట ప్రకటన చేశారు.హాస్టళ్ల యజమానులతో సంప్రదింపులు జరపాలని సిటీ పోలీస్ కమిషనర్, మేయర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఎక్కడివారు అక్కడే ఉండాలి : సీపీ
హాస్టళ్లు మూసివేత ప్రచారాలు చేయొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, ప్రైవేటు సంస్థల్లో ఉన్నవారు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసింది.
ఏపీలోని తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఎక్కడివారు అక్కడే ఉండాలంటూ స్పష్టీకరించింది. ఏమైనా సమస్యలు ఉంటే.. 1902కు కాల్‌చేయాలని ప్రభుత్వం సూచించింది.
See Also | నిత్యావసర వస్తువులను అందించడంలో ఈ కామర్స్ దిగ్గజాలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి!