Ys Jagan: అందరూ ధోనీల్లా తయారవ్వాలి.. జగన్ దిశానిర్దేశం
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్ ప్రతిభ బయటపడుతుంది.

Photo Credit : Google
Ys Jagan: పార్టీ జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించిన జగన్.. దాన్ని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో పార్టీ ఓనర్‌షిప్ మీదే అన్న జగన్.. ప్రజా సంబంధిత అంశాల్లో ఒకరి ఆదేశాల కోసం మీరు ఎదురు చూడొద్దని చెప్పారు.
మే నెలలోపు మండల కమిటీలు పూర్తి చేయాలన్నారు. జూన్-జూలైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీలలో డివిజన్ కమిటీలు పూర్తి చేయాలన్నారు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లో బూత్ కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. జిల్లా అధ్యక్షుల పాత్ర పార్టీలో చాలా కీలకమైనదని జగన్ తేల్చి చెప్పారు.
”మీ మీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషి చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది. జిల్లాల్లో మీరే సర్వం.. మీరే పార్టీ.. పార్టీయే మీరు. జిల్లాల్లో అన్ని స్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత మీది. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పనితీరు బాగోలేకపోతే ప్రత్యామ్నాయం చూడటంలో మీ భాగస్వామ్యం కీలకం. పార్టీలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది.
Also Read: యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి: పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్
భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్ ప్రతిభ బయటపడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్‌మెన్ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. అందరూ ధోనీల్లా తయారు కావాలి. రెండు మూడు సంవత్సరాలు అయితే కానీ ప్రభుత్వ వ్యతిరేకత సాధారణంగా బయటకు కనిపించదు.
కానీ ఏడాదిలోపే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మద్దతు ధరలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు జిల్లాల్లో రైతులకు అండగా ఉండాలి. రైతుల డిమాండ్లపై పోరాటం చేయాలి” అని పార్టీ జిల్లాల అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు జగన్.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here