Ysrcp: ఒకప్పుడు క్లీన్‌స్వీప్.. ఇప్పుడు ఉనికే ప్రశ్నార్థకం..! ఆ జిల్లాలో వైసీపీకి ఎందుకీ పరిస్థితి..
ఒకప్పుడు హవా చెలాయించిన వైసీపీ.. ఇప్పుడు అదే చోట కళావిహీనంగా మారింది. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. పార్టీలో ఎలాంటి జోష్ నింపుతుంది..
Ysrcp
- 2024 ఓటమితో జిల్లా వైసీపీ పరిస్థితి దారుణం..
- పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా కనిపించని నేతలు..
- గ్రౌండ్ లెవల్‌లో కనిపించని కార్యకర్తల హడావుడి..
Ysrcp: నెల్లూరు.. ఒకప్పుడు వైసీపీకి చాలా ప్రత్యకమైన జిల్లా. 2019 ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన ఫ్యాన్ పార్టీ.. 2024లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అలాంటి జిల్లాలో ఇప్పుడు వైసీపీ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారుతుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. కీలక నేతల్లో కొందరు జంపింగ్ జపాంగ్ అనడం.. మరికొందరు మౌనంగా ఉండిపోవడంతో.. వైసీపీ భవిష్యత్ ఏంటి అనే చర్చ నడుస్తోంది. అసలు నెల్లూరులో ఏం జరుగుతోంది.. ఫ్యాన్ పార్టీకి ఎందుకీ పరిస్థితి..?
ఒకప్పుడు నెల్లూరు రాజకీయాల్లో వైసీపీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. 2019ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాలు.. జిల్లాలో ఆ పార్టీ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించాయి. అప్పట్లో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లోనూ ఘనవిజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. ఐతే కాలం మారింది. ఐదేళ్ల వ్యవధిలోనే పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయ్. 2024 ఎన్నికల నాటికి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాతా తెరవలేకపోయింది. పార్టీ తరఫున బరిలో దిగిన అభ్యర్థుల్లో.. ఒక్కరు కూడా గెలుపు రుచి చూడలేకపోయారు. వైసీపీని వీడి బయటకు వచ్చిన కీలక నేతలు.. టీడీపీ తరఫున పోటీ చేసి విజయాలు సాధించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలాంటి నాయకులు విజయం సాధించడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయ్. ఇది వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
అధికారాన్ని కోల్పోయిన తర్వాత మారిపోయిన పరిస్థితులు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయ్. ఈ పరిణామాల ప్రభావం.. స్థానిక స్థాయిలో మరింత స్పష్టంగా కనిపించింది. వైసీపీకి బలంగా నిలిచిన నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడడం మొదలుపెట్టారు. నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న బొప్పల శ్రీనివాస్ యాదవ్ పార్టీకి గుడ్‌బై చెప్పడం కీలక పరిణామంగా మారింది. ఆయనతో పాటు నగరంలోని పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు కూడా వైసీపీని విడిచి పెట్టారు. వీరంతా ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే అనిల్ వర్గానికి చెందిన వారిగా గుర్తింపు పొందిన వారే. అధికారంలో ఉన్నంతకాలం బలంగా కనిపించిన పార్టీ, అధికారాన్ని కోల్పోయిన తర్వాత వేగంగా క్షీణించడం మొదలైంది. టీడీపీలోకి నేతలు క్యూ కట్టడంతో వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.
పార్టీ కోసం కష్టపడుతున్నది ఆయనొక్కరే..!
అధికారం కోల్పోయేసరికి.. మెజారిటీ నేతలు పార్టీని వీడి సైకిల్ ఎక్కేయడంతో.. వైసీపీ హవా ఎక్కడా కనిపించడం లేదు. జెండా మోసే నాయకులు కానీ.. కార్యకర్తలు కానీ.. కనిపించడం లేదు. నిజానికి నగర అధ్యక్షుడు బలంగా ఉండడంతో.. మొదటి ఆరు నెలలు అంతా బాగానే ఉందని అనుకున్నా.. ఆయనే పార్టీ మారడంతో అందరూ పార్టీని వదిలేశారు. ఇదే వరుసలో పలువురు వైసీపీ నేతలు.. టీడీపీ బాట పట్టారు. దీంతో ఇప్పుడు ఎటు చూసినా.. టీడీపీ జెండాలు.. మంత్రి నారాయణ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయ్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఒక్కరే పార్టీ కోసం కష్టపడుతున్నట్లు కనిపిస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో ఆయన ఒక్కరే.. ఆందోళనలను ముందుకు నడిపించారనే చర్చ నడుస్తోంది. పైగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత స్ట్రాంగ్ చేసేందుకు.. సర్వేపల్లిలో పాదయాత్రకు కూడా సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
కాకాణి మినహా.. వైసీపీలో మరే నాయకుడు పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. దీంతో నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. కేసులకు భయపడుతున్న వాళ్లు కొందరు.. పార్టీ పరిస్థితి బాగోలేదని ఫిక్స్ అయి ఇంటికే పరిమితం అయిన వాళ్లు మరికొందరు.. ఇలా గ్రౌండ్ లెవల్‌లో కార్యకర్తల హడావుడి కూడా కనిపించడం లేదు. దీంతో నెల్లూరులో వైసీపీ పరిస్థితి దయనీయంగా ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఎవరు కాపాడుకుంటారనేది ప్రశ్నగా మారింది. ఒకప్పుడు నెల్లూరు గడ్డపై హవా చెలాయించిన వైసీపీ.. ఇప్పుడు అదే చోట కళావిహీనంగా మారింది. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. పార్టీలో ఎలాంటి జోష్ నింపుతున్నది.. నెల్లూరులో పార్టీ భవిష్యత్‌ను డిసైడ్ చేస్తుంది.
Also Read: విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ వెనక అంతరార్థం ఏంటి? ఆయన టార్గెట్ ఎవరు?
