Cyclone Dana: ఏపీకి మరో తుపాను ముప్పు.. ఆ రెండు రోజులు భారీ వర్షాలు
ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. సముద్రంలోకి వేటకు వెళ్లినవారు తిరిగిరావాలని ..

AP Rains
AP Rains: ఏపీకి మరో తుపాను ముప్పు ముంచుకొస్తుంది. ఉత్తర అండమాన్ కు ఆనుకొని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ రేపు ఉదయం వాయుగుండంగా బలపడనుంది. ఈనెల 23వ తేదీ నాటికి వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. ఈ తుపానుకు ‘దానా’ అని నామకరణం చేశారు. ఈ తుపాను ఈనెల 24 నాటికి ఒరిశా – బెంగాల్ తీరాలకు చేరుకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ కారణంగా ఏపీలో ఈనెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
తీరం వెంబడి గంటకు 45 – 46 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. సముద్రంలోకి వేటకు వెళ్లినవారు తిరిగిరావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తుపాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు అనకాపల్లి, విశాఖపట్టణంతోపాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతినగా.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం మిగిల్చిన నష్టం నుంచి ఇంకా కోలుకోక ముందే ఏపీకి మరో తుపాను ముప్పు పొంచిఉందని వాతావరణ శాఖ పేర్కొడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.