దేశంలో అత్యధిక ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేలు వీరే.. టాప్‌ 10లో మన శాసన సభ్యులు ఎంతమంది ఉన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి ఆస్తి రూ.931 కోట్లని ఏడీఆర్ తెలిపింది.

దేశంలో అత్యధిక ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేలు వీరే.. టాప్‌ 10లో మన శాసన సభ్యులు ఎంతమంది ఉన్నారంటే?

Updated On : March 19, 2025 / 6:50 PM IST

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏయే ఎమ్మెల్యేలకు ఎంతెంత ఆస్తి ఉంది? అన్న విషయంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఓ రిపోర్టు విడుదల చేసింది. ముంబైలోని ఘట్కోపర్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షాకు దేశంలోని అందరు ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ఆస్తులు ఉన్నాయి.

ఆయన ఆస్తుల విలువ రూ.3,400 కోట్లు. ఆయన భారత్‌లోనే అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యే. ఆయన తర్వాత కర్ణాటకలోని కనకపుర ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు, మంత్రి డీకే శివకుమార్ సంపద రూ.1,413 కోట్లకు పైగా ఉందని ఏడీఆర్‌ తెలిపింది. అందరికంటే తక్కువ ఆస్తి ఉన్న ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్‌లోని ఇండస్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా నిలిచారు. ఆయన ఆస్తులు రూ.1,700 మాత్రమే.

ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఆయా ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఏడీఆర్ ఈ వివరాలు తెలిపింది. 28 రాష్ట్రాల అసెంబ్లీలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలోని 4,092 మంది ఎమ్మెల్యేల వివరాలు తీసుకుని ఈ నివేదిక రూపొందించింది.

Also Read: IPL 2025లో 10 మంది కెప్టెన్లలో కాస్ట్లీయస్ట్‌ కెప్టెన్‌ ఎవరు? అతి తక్కువ ఎవరికి? ఫుల్‌ డీటెయిల్స్..

ప్రముఖ నేతల ఆస్తులు

  • ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు: రూ.931 కోట్లు
  • ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: రూ.757 కోట్లు
  • కె.హెచ్. పుట్టస్వామి గౌడ, కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యే: రూ.1,267 కోట్లు
  • ప్రియకృష్ణ, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే: రూ.1,156 కోట్లు
  • పి.నారాయణ, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే: రూ.824 కోట్లు
  • వి. ప్రశాంతి రెడ్డి, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే: రూ.716 కోట్లు

టాప్ 10 సంపన్న ఎమ్మెల్యేల లిస్టులో ఏపీ నుంచే నలుగురు ఉన్నారు. టాప్ 20లో ఏపీ నుంచి మంత్రి నారా లోకేశ్, హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. కర్ణాటకలోని 223 మంది ఎమ్మెల్యేల సంపద మొత్తం కలిపి రూ.14,179 కోట్లుగా ఉంది. మహారాష్ట్రలోని 286 మంది ఎమ్మెల్యేల ఆస్తి మొత్తం కలిపి రూ.12,424 కోట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 174 మంది ఎమ్మెల్యేల మొత్తం సంపద రూ.11,323 కోట్లు. మరొకరి వివరాలు తెలియరాలేదు.

త్రిపుర ఎమ్మెల్యేల ఆస్తి తక్కువగా ఉంది. మొత్తం 60 మంది సభ్యుల ఆస్తి కలిపి రూ.90 కోట్లు, మణిపూర్‌లో 59 మంది ఎమ్మెల్యేల ఆస్తి రూ.222 కోట్లు, పుదుచ్చేరిలో 30 మంది ఎమ్మెల్యేల ఆస్తి రూ.297 కోట్లుగా ఉంది.

సగటు ఆస్తులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఇవే

  • ఆంధ్రప్రదేశ్ – రూ. 65.07 కోట్లు
  • కర్ణాటక – రూ. 63.58 కోట్లు
  • మహారాష్ట్ర – రూ. 43.44 కోట్లు

సగటు ఆస్తులు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు ఇవే

  • త్రిపుర – రూ. 1.51 కోట్లు
  • పశ్చిమ బెంగాల్ – రూ. 2.80 కోట్లు
  • కేరళ – రూ. 3.13 కోట్లు