దేవుడి విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం?: సీఎం జగన్

దేవుడి విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం?: సీఎం జగన్

Updated On : January 4, 2021 / 12:22 PM IST

Jagan Key Comments:రాష్ట్రంలో దేవాలయాల విషయంలో జరుగుతున్న రాజకీయంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రజల్లో ఇంత మంచి చేస్తా ఉంటే.. ఇలాంటి పరిపాలనను ఎదుర్కోవడం కష్టమని కుయుక్తులు, కుట్రలు పన్నుతున్నారని జగన్ చెప్పుకొచ్చారు. పూర్వకాలంలో పోలీసులు వస్తువులను ఎత్తుకుపోయే దొంగలను, తాళాలు పగలగొట్టి.. నేరాలకు పాల్పడే దొంగలను పట్టుకోవడానికి దర్యాప్తు చేసేవారు. ఇవాళ పరిస్థితులు అలా లేవు.. సైబర్‌నేరాలు వచ్చాయి, వైట్‌కాలర్‌నేరాలు, సోషల్‌మీడియాలో అబద్ధపు ప్రచారాలు వచ్చాయి. కలియుగంలో క్లైమాక్స్‌కు వచ్చామా? అనే పరిస్థితి కనిపిస్తుంది. దేవుడంటే భయం లేదు, భక్తి లేదనే పరిస్థితికి వ్యవస్థ దిగజారింది.

దేవుడిని రాజకీయం చేసి లాభం పొందాలనే స్థితిలోకి వచ్చారు. దేవుడి విగ్రహాలతో చెలగాటమాడుతున్నారు. వీళ్లు అసలు మనుషులనేనా? దేవుడంటే భయం, భక్తి లేదు వీళ్లకి.. మనుషులు లేని సమయంలో, అర్థరాత్రి పూట ఒక మారుమూల ప్రాంతంలోకి వెళ్లి… విగ్రహాలను పగలగొట్టడం, ప్రతిపక్షం రచ్చచేయడం, ఎల్లోమీడియా దానిని రచ్చచేయడం చూస్తున్నాం అని అన్నారు.

దేవుడి విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం? ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం? ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం? ప్రజల విశ్వాసాలను దెబ్బతీసి, తప్పుడు ప్రచారాలు, విషప్రచారాలు చేస్తే ఎవరికి లాభం? ఎవరిని టార్గెట్‌ చేసి ఈ దుర్మార్గాలు చేస్తున్నారు? ప్రజలు ఆలోచించాలని జగన్ కోరారు. మన ప్రభుత్వం ఏదైనా మంచి పనిచేస్తుంటే.. ఆ ప్రతిష్ట ప్రభుత్వానికి రానీయకుండా చూడ్డానికి ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగడుతున్నారని జగన్ అభిప్రాయపడ్డారు.

మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20వేల గుళ్లలో సీసీ కెమెరాలు పెడుతున్నాం.. విగ్రహాలను ఎవరు ధ్వంసం చేసినా ఊరుకునే ప్రసక్తేలేదు.. ప్రజల మనోభావాలతో ఆడుకుంటుకన్నారు ఎవ్వరినీ వదలొద్దు.. ఆలయాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగతోంది అని జగన్ అన్నారు.